telugudanam.com

      telugudanam.com

   

తోలు బొమ్మలు

దీర్ఘ కాలంగా ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న కళారూపం తోలుబొమ్మలాట. ప్రేక్షకులకు కన్నులపండుగ కల్పించే కళారూపమిది. బొమ్మలతో నాట్యం చేయించడమే తొలుబొమ్మలాట కళారూపం.తోలుబొమ్మలాటల గురించి అనేక శాసనాల్లో కూడా లిఖించబడి ఉంది.

మన ప్రాచీన కళారూపలలో తోలుబొమ్మలు ఒకటి. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధినాటికే చాలా ప్రచారంలో ఉన్నాయని తెలుస్తూంది. తెనుగువారి ప్రాచీన కళా వైదగ్ద్యాన్ని ఖండాంతరాలకు వ్యాపించి పెట్టిన కళ ఇది. నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనాలకు మూలం ఈ తోలుబొమ్మలే. ఖండాంతరాలకు - జావా, బోర్నియా, సుమిత్ర, బలి, సయాం, కంబోడియా, బర్మా మొదలయిన దేశాలలో - మన దేశంనుంచీ వలస వెళ్ళినవారు తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ, రామాయణం, భారతం మొదలయిన కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వీటిని ప్రదర్శించేవారు బొందిలీలు, బొందిలీ క్షత్రియులు, బొందిలీ కాపులు, వీరి భాష మరాఠీ. వీరికి ఉన్న ఆస్తి ఒక్క తోలుబొమ్మలే. పాల్కురికి సోమనాథుని కాలానికే ఇది వినబడింది.


తోలు బొమ్మలు


వీరు యక్ష గానాలనే తమ సాహిత్యంగా ఉపయోగించుకుంటారు. దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, కీచక వధ కథలతోపాటు దేశీయ కథలైన పల్నాటి వీర చరిత్ర వంటి కథలను కూడా వీరు ప్రదర్శిస్తారు. దేవతా బొమ్మలకు జింక చర్మాన్నీ, దుష్ట పాత్రల తయారీకి మేక చర్మాన్నీ వాడతారు. ప్రదర్శనలో గాత్రాలనన్నింటినీ కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈ బొమ్మలు దుకాణాల్లో దొరికేవి కావు. వీటిని ఆయా కళాకారులే స్వయంగా తయారుచేసుకుంటారు. ఈ బొమ్మలను రెండు రకాల చర్మాలతో తయారు చేస్తారు. ప్రదర్శనకు - ఒక తెల్లని తెర, హార్మోనియం, తబలా, కాగడాలు - ఇవీ వస్తువులు. వినాయకుని బొమ్మ తెరమీదకు రావడంతో ప్రార్థన చేయడంతో ప్రదర్శన ప్రారంభం అవుతుంది. ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి పాట పాడుతూ తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. తెర లోపలినుండి ప్రదర్శనను నడిపేందుకు సూత్రధారుడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు. అతని నోటినుండి జాలువారే కథ ఎంతో వివరంగానూ, రసవత్తరంగానూ ఉంటుంది. వివిధ రకాల పాత్రలకు వివిధ రకాల గొంతులు మార్చడం వీరి ప్రత్యేకత.

ఈ ప్రదర్శనలలోని ప్రత్యేక పాత్రలు జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పాగాడు. ఇవి హాస్య పాత్రలు. కేవలం ఈ హాస్య పాత్రలను చూసేందుకే కొందరు ప్రేక్షకులు వచ్చ్చేవరంటే ఈ పాత్రలను రక్తికట్టించేందుకు కళాకారులు ఎంత శ్రమించేవారో తెలుస్తోంది. వీరితోపాటు మరో విచిత్రమైన పాత్ర కేతిగాడు. ఈ హాస్య పాత్రలతో సమాజంలోని కుళ్ళును కడిగేస్తుంటారు. ఈ పేర్లు తెలుగునాట ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అల్లరి పిల్లల్ని తమ తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు కూడా ఈ మారు పేర్లతో పిలిచి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.

ప్రదర్శనలో పాటలు పాడడానికీ, బొమ్మలనాడించడానికీ ఎక్కువమంది కళాకారులు కావాలి కాబట్టి వీరిలో బహుభర్యత్వం ఆచారంగా వస్తూంది. ఎంతోమంది కళాకారుల ఉమ్మడి కృషే ఈ కళా ప్రదర్శన విజయానికి దోహదపడుంది. సమిష్టి కృషి వీరి ఆయుధం. సమైక్యంగా జీవించడం వీరి ఆశయం. అదే ఈ కళా రూప విజయ రహస్యం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: