telugudanam.com

      telugudanam.com

   

యక్షగానం

ప్రాచీనమైన దేశీ సారస్వత శాఖలో సంగీత రూపక ప్రధానమయిన యక్షగానాలను యక్షులు పాడే గీతాలు కనుక యక్ష గానాలు అనే పేరు వచ్చిందనీ, జక్కు జాతివారు వీటిని ఎంతో మక్కువతో ప్రదర్శిస్తారు కనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ పలు వ్యాఖ్యానాలున్నాయి. 16వ శతాబ్దంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


యక్షగానం


యక్షగానం అనగా దేశీయ చందోబద్ధమయిన నాటకము. దీనినే పాటగా కూడా పేర్కొనక పోలేదు. యక్షగానాల గురించి బ్రౌణ్య నిఘంటువులో పాటగా పేర్కొనబడింది. అయితే అప్పకవి దృష్టిలో యక్షగానం పాటలుగల ప్రబంధం అయివుండవచ్చునని తోస్తుంది. ఎందుచేతనంటే అప్పకవీయంలో యక్షగాన ప్రశస్తి ఉంది. అందులో అర్ధచంద్రికలూ, త్రిపుట, జంపె, ఆటతాళము, 'వీనయక్షగాన ప్రబంధంబులతుకవచ్చు ' అని పేర్కొన్నాడు. శ్రీనాధుని కాలంలో ఇవి చాలా ప్రచారంలో ఉండి ఉన్నట్లు "కీర్తింతు రెద్ధాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" అన్న దానినిబట్టి తెలుస్తూంది. ఈ యక్షగానాలు తెలుగులో సుమారు 400 దాకా ఉన్నట్లూ, మిగిలినవి అముద్రితాలనీ చారిత్రక పరిశోధకుల అంచనా. ఈ యక్షగానాలకు వసంత ఋతువు తంజావూరు రాజులకాలంలో. ఆ కాలంలో స్త్రీలు కూడా వేషాలు ధరించడం ఉండేది.


యక్షగానం


తెలుగునాడున వీథి నాటకాలు ఉన్నట్లుగానే తమిళ దేశంలో "తెరక్కుత్తు" లనీ, కన్నడంలో "బయలాటము" లనీ వ్యవహారంలో ఉన్నాయి. ద్రవిడ భాషయందు మొట్టమొదట కురవంజి అనే దృశ్య రచనలు బయలుదేరినవి. ఈ కురవలు ఆటవికులు.వీరికి అడుగు వేస్తూ నృత్యం చేయడం అలవాటు. అయితే యక్షగానాలలో గేయానికి ప్రాధాన్యం ఉంటే, కురవంజిలో నృత్యానికి ప్రాధాన్యం. ఈ యక్షగాన ప్రదర్శనము ఏ రూపంలో ఉంటుందో చూడండి.

"....ఢక్క హుడక్క జర్ఝరల్

ఝుల్లరి యాదిగా గలుగు శబ్ద

పరంపర తాళబద్దమై

యుల్లసిలం ప్రబంధముల

కొప్పగ నాడుదు రగ్రవేదిపై"

బసవ పురాణంలో పాల్కురికి యక్షగాన ప్రదర్శనల రూపం

ఇలా ఉందన్నాడు."....పాటలుగా గట్టి పాడెడు వారు. బ్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల విస్తారముగ జేసి వినుతించువారు, నటుగాక సాంగభాషాంగ క్రియాంగ పటు నాటకంబుల నటియించువారు."

ఈ యక్షగానాలలో చాలా హాస్య ప్రధానమయిన సాంప్రదాయిక పాత్రలున్నాయి.యక్ష గానంలోని కటకంవాడు, సింగి, సింగడు, సుంకరకొండడు మొదలిన సాంప్రదాయక పాత్రలు ఈనాటికీ ప్రజా హృదయాల్లో నిలిచిపోయాయి. కొన్ని యక్ష గానాల్లో ఎరుకలు, గొల్లలు మొదలైనవారి చరిత్ర, వారి సాంఘికాచారాలు, వృత్తి ధర్మాలూ, కట్టి బొట్టుతోసహా ప్రజా జీవిత వివరాలన్నీ తెలుస్తాయి. రాజులకూ, ప్రజలకు కూడా ఆదరపాత్రమైనాయి ఆనాటి యక్ష గానాలు. ప్రతి యక్షగానంలోనూ అందలి ఇతివృత్తం వేరు అయినా హాస్య పాత్రలు ప్రతిదానిలోనూ ఉంటాయి. ఈ పాత్రలన్నీ కూడా హాస్యం కోసం ఉద్దేశించబడినవే. మన పరిశోధకుల నిర్ణయాలను బట్టి చూస్తే - చెన్నశౌరి శౌభరి చరితమే మొదటి యక్షగాన రచనగా తెలియ వస్తూంది. ఇది క్రీ.శ.15వ శతాబ్ది ఉత్తరార్థంలోనిదని అంచనా. అయితే మనకు లభ్యమయిన యక్షగానాలలో - కవికాలం తెలిసినంత మట్టుకు కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయమే ప్రాచీనమైనదిగా పరిగణించబడుతూ ఉంది. యక్షగానాన్ని దేశి రచనగానే పరిగణిస్తున్నారు. సంస్కృతంలో విదూషకుని పాత్రే పాశ్చాత్య దేశాలలోని కోర్టుఫూల్, కోర్ట్ జెస్టర్, బఫూన్‌లు. వీరికి సరిపోలినవే తోలుబొమ్మలలో జుట్టుపోలిగాడు, గాంధోలిగాడు, బంగారక్క: యక్షగానాలలో కోణంగి, కురవంజిలో సింగి; సింగడు. అలాగే మాధవిపాత్ర కూచిపూడి వారి సృష్టి. ప్రతి భామాకలాపంలోనూ ఈ పాత్ర మనకు ప్రత్యక్షమౌతుంది. విదూషకునిలాగ హాస్య ప్రసంగాలను, కథనూ నడిపిస్తుంది. మాధవి పాత్రను సింహళ రూపకంలోని 'తోరాతరు కథాకారయ ' తోను, బర్మావారి నాటకంలోని 'లూ - బయట్'లతోను పోల్చుకోవచ్చును. వేషాలు వేసుకుని, పాడుతూ ప్రదర్శించే రూపకమే యక్షగానం. జానపద కళారూపాలు - ప్రాంతానికో విధంగా ఉండి ప్రచారం అయినవి కొన్ని, రాష్ట్రానికంతటికీ కాస్త ఇటూ అటుగా ప్రచారం పొందినవి, మండలాలలో ఆయా ప్రజల భాషలో ప్రాచుర్యం పొందినవి - ఇలా ఎన్నో ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో కొన్ని కళారూపలకు మంచి ప్రాచుర్యం ఉంది. అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో కొన్నింటికి ప్రచారం ఉంది. బుర్రకథ, తోలుబొమ్మలు, వీథి నాటకాలు, కలాపాలు వంటివి దేశం మొత్తం మీదనే ప్రచారం, ఆదరణ పొందాయి.

జానపద కళారూపాలు - యక్షగానం, కురవంజి, హరికథలు, ఒగ్గుకథ, చెక్కభజనలు, బుర్రకథలు, కలాపాలు, పగటి వేషాలు, గిరిజన నృత్యాలు, పిచ్చుకగుంట్లు ఇలా మరెన్నో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: