telugudanam.com

      telugudanam.com

   

కంసుడు

కంసుడు ఉగ్రసేనుని కుమారుడు. రాక్షసాంశచే పుట్టుటవలన క్షత్రియుడైనా నిర్ధాక్షిణ్యము, కఠినత్వం, దుర్మార్గం మొదలైన అంశములు బంధించి మధురా నగరానికి రాజయినాడు. జరాసంధుడు తన కుమారులైన ఆస్తి పాస్తిలను ఇతనికిచ్చి వివాహం జరిపించాడు. శిశుపాల దంత వక్ర్తులు, రుక్మి మొదలైన వారు ఈతని మిత్రులు. తన సోదరిని వసుదేవునికిచ్చి వైభవంగా వివాహము జరిపించి బావతో నగరంలోకి వస్తున్నాడు. ఆనందంగా రధం నడుపుతూ, మార్గమధ్యంలో ఆకాశవాణి మెరుపులా మెరుస్తూ "ఈనీ చెల్లెలు దేవకీ గర్భవాసాన జన్మించిన 8వ శిశువు వలన నీకు మరణం తప్పదు" అని హెచ్చరించెను. ఆ హెచ్చరిక వింటూనే ఆవేశంతో రధం నుండి కిందకు దూకి చెల్లెలిని క్రిందకీడ్చి కత్తితో ఆమెను నరకబోయెను. కానీ వసుదేవుడు "బావా! శాంతించు! ఈమె గర్భమునందు జన్మించిన ఎనిమిదవ శిశువు వల్లనే గదా! నీకు ప్రాణగండము! ఈమె ఏమిచేసింది? స్త్రీని, అబలను, పైగా నీ చెల్లెలిని చంపటం భావ్యంకాదు విడువు" అంటూ బ్రతిమిలాడెను. దేవకి కూడా "అన్నా! నన్ను విడువు. మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు తెచ్చి ఇచ్చెదము" అన్నది. కంసుడు వారిద్దరినీ చెరసాలలో బంధించి అక్కడే అన్ని ఏర్పాట్లూ చేసి పుట్టిన బిడ్డను పుట్టినట్లు తనకు చూపమని ఆదేశించి కాపలాదారులను గట్టిగా హెచ్చరించి వెళ్ళినాడు.

తరువాత దేవకికి పుట్టిన ఏడుగురు శిశువులనూ క్రమంగా వధించి వేశాడు. అష్టమ గర్భంగా జన్మించిన కృస్ణుడు "వసుదేవా! రేపల్లెలో యశోదా గర్భవాసాన యోగమాయజన్మించినది. నన్ను అక్కడ ఆమె వద్ద వుంచి, ఆమెకు జన్మించిన ఆ యోగమాయను తెచ్చి ఇక్కడ వుంచు" అంటూ చెప్పి శిశువుగా మారిపోయి కేర్ కేర్ మని ఏడ్వసాగాడు. కావలి భటులను ఉలికిపడి మేల్కొని పరుగెత్తుకుంటూ వెళ్ళి "మహారాజా! దేవకి గర్భవసాన ఎనిమిదవ శిశువు జన్మించింది" అన్నారు.

కంసుడు పరుగు పరుగున వచ్చాడు. దేవకి చేతిలోని శిశువును లాక్కున్నాడు. "అన్నా! ఇది ఆడది నీ మేనకోడలు! పసిది ఇది నిన్నేంచేస్తుంది. దయచేసి వదిలివేయి" అని బ్రతిమిలాడినది. కంసుడు నవ్వుతూ, "ఆడది అయినా అష్టమ గర్భంగదా! వదలకూడదు" అంటూ ఉండగా ఆ శిశువు ఆకాశంలో ఆగిపోయి యోగమాయగా మారి అష్టభుజాలతో దివ్య ఆయుధములతో మెరిసిపోతూ, "కంసా! నిన్ను చంపగలవాడు రేపల్లెలో పెరుగుతున్నాడు. మృత్యువును ఎదిరించడం నీతరంకాదు నీకు చావు తప్పదు" అంటూ హెచ్చరించి మాయమైపోయినది. అలా కంసుడు ప్రాణ భయంతో అల్లాడుతూ "శిశువును వెతికి చంపిరండని" పూతన, శకటాసురుడు, బకాసురుడు మొదలైన రాక్షసులను పంపి, వారినందరినీ తనమూలముగా శ్రీష్ణునిచేత చంపించి వారి మోక్షానికి కారణమయ్యాడు.

పెరిగి పెద్దవారైన శ్రీకృష్ణ బలరాములను తన నగరానికి రండి అని ఆహ్వానించి చంపడానికి చామూర ముష్టికులను వస్తాదులను, మత్తగజములను ప్రయోగించి విఫలమయ్యాడు. శ్రీకృష్ణుడు విజృంబించి "మామా! ఇంత వరకూనీ ఆకృత్యాలను సహించాను ఇక వీలులేదు నీ ఆయువు తీరినది". అంటూ సింహాసనం నుండి క్రిందకు దిగిలాగి ముష్టిఘాతాలతో మోది కంసుడిని అంతమొందించాడు. తల్లి తండ్రులను చెరసాల నుండి విడిపించి, తాతగారైన ఉగ్రసేనుడిని తిరిగి సింహాసనం పై నిలిపి రాజును చేసి గౌరవించాడు కృష్ణుడు.


శుక్రాచార్యుని జన్మవృత్తాంతం

శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది.

తర్వాత శివుడు శుసనుడ్ని మ్రింగేస్తాడు. అప్పుడు శుసనుడు తనను విడుదల చేయమని తెగ మొరపెట్టుకొన్నాడు. చివరకు శివుడు అతనిని శుక్లం వెలువడే రంధ్రంద్వారా విడిచిపెడతాడు. అలా శుక్లం ద్వారా వెలువడైన వాడే శుక్రాచార్యుడు. ఆ తరువాత అతడే రాక్షస గురువయ్యాడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: