telugudanam.com

      telugudanam.com

   

స్వాతంత్ర్యం - షష్టి పూర్తి

"దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు.

ఆ విశ్వాసానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రతిఫలం లభించింది. అంత చీకటిలోనూ కోట్లాది భారతీయుల కళ్ళలో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవయ్యేళ్ళు.అరవయ్యేళ్ళ స్వాతంత్ర ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా జరుపుకున్నాం. ఇలా 59 ఆగస్టు 15లు చేశాం. ఈ ఏడాది ఈ నెలలో 60వ పర్వదినం జరుపుకోబోతున్నాం.

60వ ఏడాదికి మన భారతీయ సంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రాధాన్యత ఉంది. కారణం దాన్ని మనం షష్టిపూర్తి ఉత్సవంగా జరుపుకుంటుండడమే. షష్టిపూర్తిని మరో జన్మలా భావించే భారతీయులు ఆ వేడుకను పండగలా ఎంతో ఆర్భాటంగా చేసుకుంటారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఈ ఆగస్టు 15కి 60 ఏళ్ళు నిండుతాయి. అంటే స్వతంత్ర భారతావని షష్టి పూర్తికి సిద్ధమయ్యిందన్నమాట. మానవ జీవితంలో జరిగే షష్టి పూర్తికీ, స్వతంత్ర భారత షష్టి పూర్తికీ ఒకే ఒక్క తేడా. ఆ షష్టి పూర్తి అరవై ఏళ్ళు నిండిన వారికి మాత్రమే సంబంధించినదైతే, ఈ షష్టి పూర్తిని ఇప్పుడే పుట్టిన పసిపాపాయి కూడా చేసుకోతగ్గది.

ఇంటా, బయటా అన్నారు పెద్దలు. 'ఇంటా' అంటే ఇంటిలో అనీ, 'బయటా' అంటే అదే ఊరిలో మరోచోట అనే అర్ధాలున్నా వాటి స్వరూపంలో నేడు మాత్రం తేడా ఉంది. నేడు ఇంటా అంటే ఇండియాలో ఎక్కడైనా అనీ, బయట అంటే భారతదేశం ఆవల ఏ విదేశంలో ఉన్నా అనర్ధం. అందుకే ఈ ఉత్సవాలను విదేశాలలోని భారతీయులు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలుగు వారైతే విదేశాల్లో ఎక్కడున్నా .....


"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము"


..... అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారి ప్రబోధాన్ని ఒక్కసారి మననం చేసుకుని అక్కడ కూడా ఈ ఉత్సవాలను జరుపుకొంటే మంచిది. ఎందుకంటే షష్టిపూర్తితో మనకున్న అనుబంధం విలువైంది. స్వతంత్ర భారత షష్టిపూర్తి విలువ అంచనాలకు అందనిది.

సంవత్సరంలో ఆగస్టు 15 సరిగ్గా 227వ రోజు. లీపు సంవత్సరానికైతే 228వ రోజు. 227 (+1) రోజులు మనం మన దేశంకంటే కూడా మన దేహం గురించే ఆరాటపడతాం. మన కోసమే బ్రతుకుతాం. ఎన్నో వేడుకలు జరుపుకుంటాం. ఎన్నో ఫంక్షన్లకు హాజరవుతాం. అవి పిలుపుననుసరించి జరిగే పేరంటాలు. ఆహ్వానం లేకుండా వాటికి వెళ్ళలేం. కానీ ఈ పేరంటానికి పిలుపులతో పని లేదు. ఇది పిలవాల్సిన అవసరం లేని పేరంటం. పిలుపు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేని పేరంటం. సంవత్సరంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ 227 (+1) వ రోజును మాత్రం కేవలం సెలవు దినంగా మాత్రమే పరిగణిస్తాం. అదెప్పుడొస్తుందాని ఎంతో ఆరాటంతో ఎదురుచూస్తాం. కానీ మన ఎదురుచూపులు సెలవు దినం వైపుకాకుండా స్వాతంత్ర దినంవైపు ఉండడం మన కనీస ధర్మం. మరణించిన మన పెద్దలను ఏటా స్మరించుకుంటాం. వారికోసం సంతర్పణలు విడుస్తాం. మరి మనం స్వేచ్చగా బ్రతకడానికి మరణంతప్ప మరో మార్గం లేదని తెలిసి కూడా కదన రంగంలోకి దూకి అసువులుబాసిన స్వతంత్ర వీరులను ఒక్క రోజైనా తలుచుకోవడం మన కనీస ధర్మం కాదా? రక్త సంబంధం లేకపోయినంత మాత్రాన వారు మనకి బంధువులు కాకపోతారా? వారికి సంతర్పణలు విడువనవసరం లేదు, ఈ సందర్భంగా ఒక్కసారి స్మరించుకుంటే చాలు.

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ పండుగను జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు. మన పండుగల్లో ఏ పండుగకీ ఇది తక్కువ కాదు. మనం జరుపుకునే వేడుకల్లో ఏ వేడుకకీ ఇది తీసిపోదు. దసరా, దీపావళి, హోలి పండుగల్లాగా దీన్ని కూడా సంబరాల కేళిగా భావిస్తే ఇది అన్ని మతాల అద్వితీయ పండుగ. ఇప్పటికి 59 ఏళ్ళు ఏదో విధంగా జరుపుకుంటూనే ఉన్నాం. ఈ షష్టిపూర్తిని మాత్రం సమిష్టిపూర్వకంగా చేసుకుందాం. ఇప్పటికే షష్టి పూర్తి చేసేసుకున్నవారూ, షష్టిపూర్తికి సిద్ధమవుతున్నవారూ మీ షష్టి పూర్తితోపాటూ ఈ షష్టిపూర్తి గురించి కూడా కాస్త ఆలోచిస్తారని భావిస్తున్నాం.

ఈ షష్టిపూర్తికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వేడుకను ఆగస్టు 15 నుండి వచ్చే ఆగస్టు 15 వరకు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక్కరే విడిగా చేసుకోవచ్చు. అందరూ కలసి ఒకేసారి చేసుకోవచ్చు. అందరూ కలసి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒకే రోజు చేసుకున్నవారు కూడా అదే రోజు మళ్ళీ చేసుకోవచ్చు. సాధారాణంగా ఆగస్టు 15 రోజున పాఠశాల విద్యార్ధులు ఎటువంటి ఉత్సాహాన్ని చూపుతారో అదే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరూ చూపాలి. అప్పుడే ఈ షష్టిపూర్తికి నిండుదనం. అమరవీరులకు అసలైన నీరాజనం.

షష్టిపూర్తికి సమయత్తమవ్వాలనే సమధికోత్సాహం మీకు కలిగితే మరింక జాతీయ జెండాను అమర్చుకోవడమే తరువాయి. ఐతే మన ఈ జెండాను ఎలాబడితే అలా ఎగురవేయకూడదు. దీనికీ కొన్ని నియమాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన నియమాలివి. ఆ నియమాలను పాటిస్తూ మన జాతీయ జండాను ఎగరేద్దాం... మువ్వన్నెల రెపరెపలు మురిపాలను చిందించేలా...

...తెలుగుదనం

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకం

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని ఫ్లాగ్ కోడ్-ఇండియాలో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి.

అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్‌కి కట్టుబడి ఉండి, ఐ.యస్.ఐ మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం. జాతీయ జెండా కొలతలు: 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి. ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి.జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి.సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు. ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా పాటించాలి. జైహింద్!

ఈ షష్టిపూర్తిని ఇష్టపూర్తిగా చేసుకుందాం. ఈ షష్టి పూర్తి భావితరాల భరతావనికి స్ఫూర్తి.


మూలం:- వార్త 10 ఆగష్టు 2003

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: