telugudanam.com

      telugudanam.com

   

మొహర్రం

మొహర్రం

కాలం తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు.అంతులేని నిరంతర కాలప్రవాహంలో మలుపులే కానీ మజిలీలు లేవు.కాలగమనంలో ఎన్నో కేలండర్‌లు మారుతూనే ఉంటాయి.ఎన్నెన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఈ కాల ప్రవాహంలో నూతన సంవత్సరాలు వస్తూనే ఉంటాయి.కనుమరుగు అవుతూనే ఉంటాయి.ఈ గమనం సృష్టి ఆదినుండి ఒక క్రమ పద్దతిలో అంతం వరకూ జరుగుతూనే ఉంటుంది. జనవరి చైత్రమాసం (గాది)లాగా మొహర్రం మాసంతో ముస్లీంల హిజ్రీ శకం ప్రారంభమవుతూ ఉంటుంది.నూతన సంవత్సరానికి నాంది పలుకుతూనే ఉంటుంది.మహనీయ ప్రవక్త ముహమ్మద్(స)తన శాంతి సందేశాన్ని సర్వమానవ సమానత్వ దివ్యజ్ఞాన జ్యోతులను ప్రపంచానికి అందించే ప్రయత్నంలో మక్కా నగరాన్నుండి మదీనాకు వలస వెళ్ళిన నాటి నుండి హిజ్రీ శకం ఆరంభమవుతుంది. ఈ మొహర్రం మాసానికి ఆది నుండి ఒక విశిష్టత చోటు చేసుకుంది.

"మొహర్రం"పేరు వినగానే ముస్లీంలకే కాదు,ముస్లిమేతరులకు సైతం ఎంతో ఆత్మీయంగా గోచరిస్తుంది.మత సమరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.త్యాగధనుడూ,అమరవీరుడూ,న్యాయశీలుడూ అయిన హజ్రత్ ఇమాం హుసైన్(రజి)గుర్తుకు వస్తారు.వారి త్యాగ నిరతీ,వారి పరాక్రమం, వారి కష్టాలు ప్రతి ఒక్కరి హృదయాలను స్పందింపజేస్తాయి. చరిత్ర పుటలును తరచి తరచి చూస్తాయి.ఆ పుటల్లో న్యాయానికీ అన్యాయానికీ, ధర్మానికి అధర్మానికీ స్వాతంత్ర్యానికీ పారతంత్ర్యానికి మధ్యన సంఘర్షణ జరుగుతూనే ఉన్నట్లు అనాది నుండీ గమనిస్తాము.ప్రజస్వామ్య పరిరక్షణ కోసం ధర్మరక్షణ కోసం, మంచి కోసం సత్యం కోసం ప్రాణాన్ని తృణపాయంగా భావించి అమరగతులైన హజ్రత్ ఇమాం చరిత్ర కూడా ఉంది.

అమాయకుల రక్తంచే ఎర్రబారిన కర్బలా మైదానం కూడా గుర్తుకు వస్తుంది. ఆ విషాధ సంఘటనలు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు విషణ్ణ హృదయాలతో బరువెక్కిపోతారు.ఈ సంఘటనకు ఇంకొంచెం ముందుకు వెళితే నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం మానవ మహోపకారి మహాప్రవర్తన(న)క్రీ.శ.632లో పరమపదించిన తర్వాత ప్రజాస్వామ్య పద్దతిలో తమ ప్రజా ప్రతినిధిని (ఖలీఫా)ఎన్నుకునేవారు.ఈ పరంపరలో ప్రథమ ఖలీ ఫాగా హజ్రత్ అబూబక్ర్ సిద్దీక్ (632-634క్రీ.శ)ఆయన తర్వాత హజ్రత్ ఉమర్ (క్రీ.శ.634-642)ఆ తర్వాత హజ్రత్ ఉస్మాన్ (క్రీ.శ.642-654)వారి తర్వాత హజ్రత్ ఆలీ (క్రీ.శ654-659)వరకు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికై ప్రజానురంజకముగా పరిపాలించారు.వీరి పరిపాలనా కాలంలో సర్వత్రా న్యాయమే రాజ్యమేలింది.ఆర్థిక సాంఘీక సమాజిక రంగాల్లో సమతూకం నెలకొంది.ప్రపంచ చరిత్రలో స్వర్ణాధ్యాన్ని సృష్టించింది.ఆ తర్వాత వచ్చిన స్వార్థ ప్రజాప్రతినిథులు కొందరి వలన పరిపాలన అస్తవ్యస్తమైనది.దుర్మార్గం, దౌర్జన్యం, అశ్లీలం, స్వార్థపరత్వాలతో సమాజం నిండిపోయింది.

సమాజం పతనావ్యవస్థను చేరుతున్న సమయంలో సమజంలో శాంతి సామరస్యాన్ని నీతి నిజాయితీలకు ప్రాణం పోసి,దుష్ట సాంప్రదాయాలను మట్టుపెట్టి ధర్మ సంస్థాపనా లక్ష్యంతో హజ్రత్ ఇమాం హుసైన్ దైవ మార్గంలో అశువులు బాశారు.ఆ మహానీయుని అడుగుజాడల్లో పయనించి సమాజాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత మనందరిపై ఉంది.దుష్ట సాంప్రదాయాలను, దురాచారాలను, స్వార్థ రాజకీయాలను పారద్రోలి న్యాయం,ధర్మం,శాంతి సామరస్యాలను పునరుద్దరించేందుకు తగిన కృషి చేయవలసినదని గుర్తు చేస్తూ ఉంది మొహర్రం.ఈ మొహర్రం మాసంలోని పదవ దినానికి ప్రాధాన్యత ఉంది. నవ చైతన్యానికి నాంది పలికిన రోజును "ఆషూరా" అని వ్యవహరిస్తారు. "ఆషీర్" అంటే పదవ దినం కాబట్టి దానిని "ఆషూరా" గా ప్రసిద్దిగాంచింది. దైవం ఆ రోజున భూమ్యాకాశాలూ, పర్వతాలూ, సముద్రాలూ, సూర్యచంద్రులనూ, స్వర్గనరకాలను సృష్టించాడని అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని లేఖనాలను బట్టి తెలుస్తుంది. ఇస్లాం ప్రభవించే పూర్వం నుండి ఈ దినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

కక్షలూ కార్పణ్యాలతో స్వర్థ ప్రయోజనాలతో అవినీతి అక్రమాలతో దుర్మార్గదౌర్జన్యాలతో మిళితమైన నేటి సమాజానికి ఐక్యమత్యంతో అందరూ మెలగాలని సౌబ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని నీతి నిజాయీలతో, శాంతి సౌమన్స్యాలతో, సత్య ధర్మాలతో వాటిని ఎదుర్కొని ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించేందుకు హజత్ ఇమాం హుసైన్ జీవితం ఆదర్శంగా నిలుస్తూ ఉంది.ప్రజలందరికీ న్యాయం, ధర్మం, గౌరవమర్యాదలు లభ్యమయ్యే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయన జీవితం పునాదివంటిద్కి.ప్రజాస్వామ్య వాదులు, ప్రజాస్వామ్య ప్రియులు హజ్రత్ ఇమాం హుసైన్ త్యాగాలను పరాక్రమాలను మననం చేసుకుంటూ ఉండడం మాత్రమే కాక ఆచరణలో పెట్టడం ఆయనకు నివాళులర్పించడమే.

మూలం: వార్త

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: