telugudanam.com

      telugudanam.com

   

రంజాన్

రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

ఆత్మ ప్రక్షాళనకు త్రికరణశుద్ధితో ఉపవాసం ఉండడమే ఎకైక మార్గమని బోధించిన దేవుని ఆదేశానుసారం గురువారం సాయంత్రం నెల పొడుపును చూసిన తరువాత శుక్రవారం సూర్యోదయ సమయంలో జరుపుకునే 'సహరీ'తో ఉపవాసాలు ప్రారంభమవుతాయి. ఈ ఉపవాస వ్రతాన్నే "రోజా" అంటారు. నియమానుగుణంగా సాగే నమాజులు పవిత్ర రంజాన్ మాసంలో దైవ సాన్నిధ్యానికి సోపానాలు. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవచింతన కూడా కలుగుతుందని భావన. ఈ నెల రోజులపాటు రాత్రి వేళ "తరావీహ్" నమాజును నిర్వహిస్తారు. ప్రతి వంద రూపాయలకు రెండున్నర రూపాయల చొప్పున పేదలకు "జకాత్" పేరుతో దానం చేస్తారు. "ఫిత్రా" రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు. జకాత్, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోచించిన నియమాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యోదయంలో జరిపే "సహరి" నుండి, సూర్యాస్తమం వరకు జరిపే "ఇఫ్తార్ వరకు మంచి నీళ్ళను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిధులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు. ఉపవాస వ్రతాలను ఆచరించడంవల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతంకంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతికాముకులుగా పరివర్తన చెందుతారు.

రంజాన్ స్త్రీ పురుషులందరూ ఉపవాస వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించిన భగవంతుడు చిన్నపిల్లలకు, వృద్ధులకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీలకు, వ్యాధిగ్రస్తులకు కొన్ని మినహాయింపులు ప్రసాదించాడు. వీరందరికీ ఉపవాస వ్రతంనుంచి మినహాయింపు ఉంది.

"తరావీహ్" నమాజులు పాపాలను పారద్రోలే క్రతువులు. "షబేఖదర్" ఇదే నెలలో వచ్చే పుణ్యదినం. రంజాన్ మాసం ప్రారంభం అయ్యాక 27వ రోజు షబేఖదర్‌ను జరుపుతారు.ఆ రోజు రాత్రంతా మెలుకువతో ఉండి ప్రార్ధనలు జరిపితే వెయ్యి నెలలపాటు ప్రార్ధనలు జరిపినట్లు లెక్క.మళ్ళీ నెల రోజులకు నెలపొడుపును చూసేంతవరకు ఇవి కొనసాగుతాయి. ఉపవాసాలు ముగిసిన తర్వాతి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక నమాజులు నిర్వహిస్తారు. ఉపవాసాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో అందరు మతస్తులూ పాల్గొంటారు.

కేవలం ఆహారం తీసుకోకపోవడమే ఉపవాస లక్షణం కాదు. ఆహారంతోపాటు వారు చెడు ప్రవర్తనకూ, చెడు చేష్టలకు కూడా దూరంగా ఉంటారు. ఆ లక్ష్యాన్ని ప్రతి సోదరుడూ గుర్తెరిగి దీక్ష వహిస్తాడు కాబట్టి వారిలో దైవ భీతితో కూడిన నిస్వార్ధపరత్వం పెంపొంది ఆత్మ శుద్ధి చేసుకుని భగవంతుని దీవెనలు పొందుతారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: