telugudanam.co.in

      telugudanam.co.in

   

భోగి

భోగి అంటే భోజనం

భోగి అంటే దేవునికి భోగం

భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం

భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం

భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం

భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం

భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ కళకళ లాడుతుంటాయి. కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు... ఇంటి నిండా ఆత్మీయులు, సన్నిహితులు... అబ్బో... ఆ వేడుక చూడడానికి ఇంద్రుడికున్న వెయ్యి కళ్లు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలవేమో. పిల్లల ఆటపాటలు, బావలను ఆటపట్టించే మరదళ్లు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్లు, అందరికీ రకరకాల పిండివంటలు తయారుచేసే అమ్మమ్మలు, మేనత్తలు... ఇవన్నీ పండగ సంబరాలను ఆస్వాదించేలా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికాపుటాలను సోకుతుంది. లోగిళ్లన్నీ ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడతాయి. భోగి అంటేనే భోగమయిన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంత సంపన్నమైన పండగ మరొకటి లేదని నిరూపిస్తుంది.

పూర్వం ఈ సమయానికి పంటలన్నీ చేతికి వచ్చి గాదెలు నిండి లోగిలి ధాన్య రాసులతో నిండి నిండు చూలాలులా ఉండేది. ఈ పండుగను వేడుకగా మూడు రోజులు చేసుకునే ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఈ పండగకి మూడు రోజులూ ఇంటిల్లిపాదీ పనివారితో సహా కొత్త దుస్తులు కొనుక్కునేవారు. నేతపనివారు చలికాలం లోనే వస్త్రాలు తేలికగా నేయగలరు. వేసవిలో అయితే దారాలు త్వరగా తెగిపోతాయి. అందుకే ఏడాదికి సరిపడా దుస్తులు ఈసమయం లోనే తీసుకునేవారు. ఆరోజుల్లో వస్తు మార్పిడి విధానమే ఉండేది. నేసిన వస్త్రాలకు ప్రతిగా ధాన్యాన్ని కుంచాలతో కొలిచేవారు. అలా వారు వీరు అనే తేడా లేకుండా అందరి ఇళ్లు సుసంపన్నంగా ఉండేవి.


భోగి మంటలు

భోగి సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ ఇది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరవాత, దాని మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేస్తారు. ఈ రోజున మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలి కాచుకుంటూ పరమానందం చెందుతారు.


భోగి రొజున తలంటు

తల మాడుపై ఉండే బ్రహ్మరంధ్రం మీద నువ్వులనూనె పెట్టి తల్లి తలంటు పోయాలి. ఆ రంధ్రం లోకి నూనె చేరటం ద్వారా చైతన్యం కలుగుతుంది. తప్పనిసరిగా కుంకుడుకాయల రసంతోనే తలంటి, తల ఆరటం కోసం సాంబ్రాణి పొగ వేసి జుట్టు ఆరబెట్టాలి. దీనివల్ల కుదుళ్లు గట్టిపడతాయి. ఆ తరువాత పిల్లలకు నూతన వస్త్రాలు వేస్తారు. సూర్యునికి ఇష్టమయిన పాయసం తప్పనిసరిగా చేస్తారు. సంక్రాంతి అమావాస్య నాడు వచ్చి, అయనం మార్పు జరుగుతుంది. పితృకార్యాలు చేయడానికి మంచిది. ఆ కార్యాలు చేయవలసిన వాళ్లు వాటికి సంబంధించిన వంటకాలన్నీ ఏర్పాటు చేయాలి. అందువల్ల భోగి నాడు సంబరాలు చేసుకోవాలి. ఏ బాధలు పోవాలనే ఆకాంక్షతో ఈవిధంగా చేస్తారు.

అమ్మ వంటలు పూర్తి చేయగానే పిల్లలు లొట్టలు వేసుకుంటూ పిండివంటలు కడుపునిండా తింటారు. సాయంత్రం అయ్యేసరికి భోగిపళ్లకు సిద్ధం అవుతారు. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగి మూడిటినీ కలిపి తలచుట్టూ మూడు సార్లు తిప్పి తల మీద పోస్తారు. ఇంట్లోని పెద్ద వాళ్ల తరువాత పేరంటాళ్లు కూడా పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూల రేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల పిల్లలపై దృష్టి దోషం పోతుందనేది విశ్వాసం. పిల్లలు కూర్చునే పీట కింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరువాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో కూడా ఆరోగ్యానికి ఉపకరించే వాటిని (మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క) ఇస్తారు. మన పండుగల వెనుక ఆరోగ్యం దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగ వస్తున్నాయి. కొన్ని చోట్ల భోగి పళ్లు పోయడానికి ముందు కొబ్బరి ముక్కలు చిన్నచిన్నగా తరిగి వాటిని దండగా గుచ్చి పిల్లలకి మెడలో వేస్తారు. భోగిపళ్ల ప్రహసనం పూర్తయ్యాక ఆ ముక్కలు పిల్లలు తినేస్తారు.

ప్రతి పండగ వెనక పరమార్ధం, లౌకికం ఉంటాయి. మనవలందరూ ఇంటికి చేరడంతో తాతయ్యలకు, అమ్మమ్మలకు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే వారికి రెట్టింపు ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఎక్కడేక్కడో ఉన్న వారంతా ఈ సంధర్భంగా ఒకచోటికి చేరుకుని, సంబరాలు చేసుకోవటం, ఇంటిల్లిపాదీ ఒకరినొకరు ఆట పట్టించుకోవటం... ఇవన్నీ వారికి నూతన శక్తినిస్తాయి. మళ్లీ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. అసలు పండగల వెనక ఉన్న పరమార్ధమే ఇది. ఈ హడావిడి సమాజంలో ఇటువంటి పండగలే అందరినీ ఒకచోటికి చేరుస్తున్నాయేమో. శ్రీరస్తు శుభమస్తు.


అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు ఉపయోగం

అల్లుడితో భోజనం అంటే మామగారికి భోగం. ప్రతిరోజూ సాధారణమైన భోజనం చేసి విసుగెత్తిన మామగారు. అల్లుడి రాకతో ఇంట్లో వండే పిండివంటలన్నీ కడుపునిండా భుజిస్తారు. కొడుకుతో చదువు అంటే పిల్లాడితో మళ్ళీ నేర్చుకోవటం. ఏనాడో వదిలేసిన చదువును మళ్ల్లీ పిల్లలతో పాటు అభ్యసించడం అన్నమాట. మొత్తం మీద అందరికీ ఇది ఎంతో ఆనందదాయకమైన పండుగ. వృత్తి పనులు చేసే మిరాసీదార్లు ఏడాది పొడవునా చేసిన పనికి ప్రతిఫలంగా ధనం అడిగేవారుకాదు. ఈ పండుగ సమయంలో ఏడాదికి సరిపడాధాన్యం పంట నూరుస్తుండగానే తీసుకువెళ్లేవారు.


సూర్యారాధన సంరంభం

  1. ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి.
  2. రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం.
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: