telugudanam.com

      telugudanam.com

   

కూర్మ జయంతి

అగ్ని దేవుడు వశిష్ఠునితో "వశిష్ఠా! ఇప్పుడు కూర్మావతారమును వర్ణించుచుంటిని వినుము. దీనిని వినిన సమస్త పాపములు నశించును. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దుర్వాసుని శాపము వలన లక్ష్మికూడ తొలగిపోయెను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించి యున్న విష్ణు భగవానుని చెంతకేగి "భగవాన్! తమరు దేవతలను రక్షించవలెను" అని ప్రార్థించిరి.

శ్రీహరి, బ్రహ్మాది దేవతలతో "దేవగణములారా! మీరు క్షీర సముద్రమును మధించుడు. అమృతమును పొందుటకును, లక్ష్మీప్రాప్తి గలుగుటకును మీరు అసురులతో సంధి చేసికొనవలెను. ఏదైననూ ఒక మహత్కార్యము నిర్వహించవలెనన్న ఒక మహత్ప్రయోజనము పొందగోరినను, శత్రువులైనను సంధి చేసికొనవలెను. నేను మిమ్ములను అమృతమునకు హక్కుదారులను చేసి దైత్యులను వంచితులను గావించెదను. మీరు దైత్యరాజు బలి చక్రవర్తిని నాయకునిగా నియమించుకొని మందరాచలమును కవ్వముగచేసి, వాసుకి సర్పమును కవ్వపు త్రాడుగచేసి, నా సహాయమును కూడ పొంది, క్షీరసాగరమును మధించుడు" అని చెప్పగా దేవతలు, దైత్యులతో సంధి చేసికొని, క్షీర సముద్రమును చిలుకుట ప్రారంభించిరి. వాసుకి సర్పము తోకవైపు దేవతలు నిలచిరి. వాసుకి సర్ప నిఃశ్వాసములకు దానవులు బలహీనులగుచుండిరి. దేవతలు భగవానుని కృపాదృష్టితో బలవంతులగుచుండిరి.

సముద్ర మథనము ప్రారంభమయ్యెను. ఏమియు ఆధారము లేకపోవుటచే మందరాచలము సముద్రమున మునిగిపోయెను. అప్పుడు విష్ణు భగవానుడు కచ్ఛపరూపము (కూర్మరూపము) ధరించి మందరాచలమును తన వీపుపై ఉంచెను. అప్పుడు తిరిగి సముద్రమును మధించసాగిరి. దానినుండి హాలహల ప్రకటమయ్యెను. దానిని శంకర భగవానుడు తన కంఠమందు ధరించెను. దీనిచేత కంఠమున నల్లని మచ్చ ఏర్పడుటచే శంకర భగవానుడు నీలకంఠ నామముతో ప్రసిధ్ధుడయ్యెను.

ఆ తరువాత సముద్రము నుండి వారుణీదేవి, పారిజాత వృక్షము, కౌస్తుభమణి, గోవులు, అప్సరసలు, లక్ష్మీదేవి విష్ణుభవానుని చేరగా, సమస్త దేవతలు దర్శించి స్తుతించిరి, దీనివలన అందరూ లక్ష్మీ సంపన్నులయిరి.

అనంతరము అయుర్వేద ప్రవర్తకుడైన ధన్వన్తరి భగవానుడు అమృత కలశముతో ప్రకటమయ్యెను. దైత్యులా కలశమును లాగుకొని దాని నుండి సగము దేవతల కిచ్చి మిగిలినది తీసికొని జంభాది దైత్యులు వెళ్ళుచుండిరి. వీరు వెళ్ళుట గాంచిన విష్ణు భగవానుడు మోహినీ రూపము ధరించెను. రూపవతి అయిన ఈ స్త్రీని గాంచిన దైత్యులు మోహితులై "సుముఖీ! నీవు మాకు భార్యవై ఈ అమృతమును మాచే త్రాగించుము" అని కోరగా అట్లే అని మోహినీ రూపమున నున్న భగవానుడు ఆ అమృత కలశము గ్రహించి దేవతలచే త్రాగించుచుండెను. ఆ సమయమున రాహువు చంద్రుని రూపము ధరించి అమృతమును త్రాగుచుండెను. అప్పుడు సూర్య, చంద్రులు వాని కపట వేషమును ప్రకటించిరి. ఇది గాంచిన శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను. కాని దయగలిగి మరల జీవింపజేసెను.

అప్పుడు రాహువు, శ్రీహరితో "ఈ సూర్యచంద్రులను నేను అనేక మారులు గ్రహణముగా పట్టెదను, ఆ గ్రహణ సమయమున జనులు ఏ కొద్ది దానము చేసినను, అది అక్షయమగును" అని చెప్పగా శ్రీహరి "తథాస్తు" అనెను.

ఆ తరువాత స్త్రీ రూపమును విష్ణు భగవానుడు త్యజించెను. కాని శంకర భగవానుడు "ఆ మోహినీ రూపమును మరల దర్శింపజేయు" మని కోరుకొనెను. అప్పుడు శ్రీహరి మరల మోహినీ రూపమును ధరించగా, శంకర భగవానుడు మాయతో మోహితుడై పార్వతిని విడిచి మోహిని వెంటపడెను. శంకరుడు ఉన్మత్తుడై మోహిని కేశములను పట్టుకొనెను. మోహిని కేశములని విడిపించుకొని వెళ్ళిపోయెను. శంకర భగవానుని వీర్యము పడినచోట శివలింగక్షేత్రములు మరియు బంగారు గనులు ఏర్పడెను. అనంతరము శంకర భగవానుడు ఇది మాయ అని గ్రహించి తన స్వరూపమున స్థితుడయ్యెను.

అప్పుడు శ్రీహరి శంకరునితో "రుద్రా! నీవు నా మాయను జయించితివి. నామాయను జయించిన వాడవు నీవు ఒక్కడివే. దైత్యులకు అమృతము లభించనందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గమును పొంది" రనెను. దైత్యులు పాతాళమున ప్రవేశించి అచ్చట నుండి సాగిరి. దేవతల విజయ గాధను చదివెడివారు స్వర్గలోకమునకు వెళ్ళుదురు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: