telugudanam.com

      telugudanam.com

   

మథర్స్ డే

అమ్మ

అమ్మ

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ' అంటూ మనము మొదట అమ్మకు ప్రణామం చేసిన తరువాతనే తండ్రికి, గురువుకి ప్రణామం చేస్తాం. పుట్టిన ప్రతి వ్యక్తికి మొదటి గురువు అమ్మే. అసలు ఈ సృష్టిలో అతి తీయనైన, కమ్మనైన పదం అంటూ ఉంటే అది 'అమ్మే'. ఈ 'అమ్మ' అనే రెండు అక్షరాల పదం లేకపోతే ఈ జగత్తు లేదు. మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే, అమ్మ లేకపోతే మనము లేము, ఈ సృష్టి లేదు. మనల్ని నవ మాసాలు మోసి కని, పెంచేది అమ్మే, పెరిగి పెద్ద వాళ్ళమైన తరువాత ఎన్నో తప్పులు చేస్తే వాటిని ఓర్పుతో క్షమించి, మన తప్పులను సరిదిద్దుతుంది అమ్మ. అమ్మ మనసంత స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సు ఎవరకీ ఉండదు. అమ్మ మనసు గురించి ఎందరో కవులు ఎన్నో కవితలు, కథలు వ్రాసారు, ఒకరు "పెదవి పలికే మాటల్లో తీయని మాటే 'అమ్మ' " అంటే మరొకరు ఎవరు వ్రాయ గలరు 'అమ్మ' అను మాటకన్న తీయని మాట" అని అంటున్నారు. అంత గొప్పదైన అమ్మ మనస్సును గురించి ఒక చిన్న కథను మనము ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం ఒక దేశానికి రాజు ఉండే వాడు. అతని తల్లి తనను కని, ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాడిని చేసి అతనికి పెళ్ళి వయసు వచ్చే సరికి ఒక రాకుమార్తెను తెచ్చి వివాహం చేసింది. కొన్నాళ్ళు గడిచాక రాజు గారి భార్య తనకు జబ్బు చేసింది అని, తన జబ్బు తగ్గాలంటే మీతల్లి గుండెకాయను తెచ్చి ఇవ్వమని రాజును కోరింది. రాజు సరే అని చెప్పి తన తల్లి దగ్గరకు వెళ్ళి "నా భార్య జబ్బు తగ్గాలంటే నీ గుండె కావలి ఇవ్వు" అమ్మా అని అడిగాడు, సరే తీసుకో బాబు అని చెప్పింది అమ్మ. అలానే అని రాజు తన తల్లిని చంపి ఆమె గుండెను తీసుకొని వెళుతుండగా దారిలో ఒక ఎదురు రాయి తగిలి అమ్మా అంటాడు, వెంటనే తన చేతిలో ఉన్న తన తల్లి గుండె "నెమ్మదిగా బాబు చూసుకొని వెళ్ళు, దెబ్బ తగిలిందా అని తల్లడిల్లి పోయింది" తల్లి ప్రేమ చూసిన రాజుకి తాను చేసిన తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు.

అలాగే గొప్పవాడైన శివాజిని ఛత్రపతిగా చేసింది తన తల్లి జిజియాబాయే. ఇలా చెబుతూ పోతే తల్లి మనస్సును, మంచి తనాన్ని మనం అంచనా వేయటానికి మన జీవిత కాలం సరిపోదు.

ఇప్పటి వరకు తల్లి మనస్సును గూర్చి తెలుసుకొన్నాము. పరశురాముడు తన తల్లి ఆజ్ఞను పాటించి తన తండ్రిని సైతం చంపుటకు వెనుకాడలేదు.

మనం పరశురాముడంతటి గొప్ప వాళ్ళము అవ్వక పోయినా కనీసం మన అమ్మకు మనసారా ఒక్క సారి అయినా కృతజ్ఞత చెప్పి ఉంటామా? ఆ కృతజ్ఞతలు తెలియజేయటానికి మనం "Mother's Day" అని ఒక రోజును పెట్టుకొని, సంవత్సరంలో ఒక రోజైనా అమ్మకు మనసార వందనం చేసి, తను చేస్తున్న పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తే మనకు తృప్తి కలుగుతుంది. అప్పుడు కూడా ఆ తృప్తి మనకే, అమ్మకు కాదు, అప్పుడు కూడా అమ్మ తనకు కృతజ్ఞతలు చెప్పటానికి తన పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని ఆలోచిస్తుంది.

అటువంటి అమ్మకు ఈ రోజున మనసారా పాదాభివందనం చేసి అమ్మ ఆశీర్వాదం పొందుదాం.

చివరగా అమ్మ గురించి ఒక చిన్న ఇంగ్లిష్ వాక్యము

"OF ALL THE NICE WORDS IN THE WORLD NICEST WORD MUST BE 'MOTHER' ".

చివరిగా మాతృమూర్తులందరికి మా హృదయపూర్వక వందనాలు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: