telugudanam.com

      telugudanam.com

   

వరాహ జయంతి

అనంత భగవానుడు ప్రళయకాలంమందు జలమున మునిగిపోయిన పృధ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించెను. ఒక దినము స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మ దేవునితో ఇట్లనెను. "తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు. జీవము నొసగువారు. మీకు నా నమస్కారములు. నేను మిమ్ములను ఏవిధముగ సేవింపవలెనో ఆజ్ఞ ఇండు.

మనువు మాటలు వినిన బ్రహ్మ, "పుత్రా! నీకు శుభమగుగాక. నిన్నుగాంచి నేను ప్రసన్నుడనైతిని, నీవు నా ఆజ్ఞను కోరితివి. ఆత్మ సమర్పణము గావించితివి.పుత్రులు తమ తండ్రిని ఈ విధముగనే పూజింపవలెను. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించవలెను. నీవు ధర్మ పూర్వకముగ పృధ్విని పాలించుము. యజ్ఞములతో శ్రీ హరిని ఆరాధింపుము. ప్రజలను పాలించుటయే నన్ను సేవించి నట్లగును" అని చెప్పగా మనువు ఇట్లనెను.

"పూజ్యపాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాలించెదను. ఐననూ సర్వజీవులకు నివాసస్ధానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను" అని అడుగగా!

బ్రహ్మ, పృధ్విని గురించి చింతించుచూ, దానిని ఉద్ధరించుటకు గాను ఆలోచింప సాగెను. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు అకారమంత ఒక వరాహ శిశువు వెలువడెని. చూచుచుండగనే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరహ భగవానుడు ప్రసన్నుడయ్యెను.

వరాహ భగవానుడు జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించెను. జలమందు మునిగియున్న పృధ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానునితో తలపడెను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను.

జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మది దేవతలుగాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డ్గగించి దానిపై పృధ్విని స్ధాపించెను.


మూలం : నిత్యజీవితములో పండగలు-పర్వదినాలు పేజీ నెంబరు 134

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: