telugudanam.com

      telugudanam.com

   

శ్రీకాకుళం సూర్యనారాయణస్వామి

ప్రపంచంలో అన్ని జీవరాశులకు ఆధారముగా వుండే సూర్యనారాయణస్వామిని మనం ఒక ముఖ్యమైన దైవంగా పరిగణిస్తాము. మార్కండేయ పురాణంలో సూర్యుడు ఎలా ఉద్భవించాడో తెలియజెప్పారు. ప్రపంచ సృష్టి జరిగినప్పుడు ముందు ఓం అనే ప్రణవనాదం వెలువడింది. ఆ ఓంకారనాదం నుండి ఉద్భవించిన వాడే ఆదిత్యుడు.

ఆదిత్యుడు కాశ్యప మహర్షి పుత్రుడు మారీచ మునిపౌత్రుడు. విశ్వకర్మ పుత్రికని వివాహమాడిన ఆదిత్యునికి వైవస్ధాయనుడు మరియు యమధర్మరాజు అను పుత్రులు యమునా అనే పుత్రిక వున్నారు. ఏడు రంగుల, ఏడు గుర్రాలతో వున్న రధాన్ని ఆదిత్యుడు ప్రపంచం చుట్టూ తిరగడానికి ఉపయోగించేవాడు. నవగ్రహాలలో మొదటి గ్రహమైన సూర్యుడు తామరపువ్వు చెతబూని దర్శమిస్తాడు.

ఆదిత్యుని నమస్కరించేవారికి ఆరోగ్యం, కీర్తి, ఎనలేని సంపదలు లభించగలవు. పురాణాలలో ఇంతటి ప్రతిష్ట వున్న సూర్యభగవానుడు అరసవల్లిలో ఒక ఆలయంలో విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు.

ఒకసారి దేవేంద్రుడు ఈశ్వరుడిని దర్శించడానికి కైలాసానికి వెళ్లాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు పార్వతికి తాంత్రిక యోగాన్ని బోధిస్తున్నాడు. ఈశ్వరుడిని దర్శించటానికి ఎవరినీ అనుమతించబడని అంతరంగిక విషయం. అందుకని ఈశ్వరుడు తమని దర్శించడానికి ఎవరినీ అనుమతించవద్దని ద్వారపాలకుడైన నంది దేవుడిని ఆజ్ఞాపించాడు.

ఈశ్వరుడి ఆజ్ఞని శిరసా వహించే నంది దేవుడు ఇంద్రుని కైలాసం లోపలికి వెళ్లకుండా అడ్డగించాడు. ఒక నంది తన దారికడ్డుగా నిలబడి కైలాసం లోపలికి వెళ్లకుండా అడ్డగించడం అవమానంగా భావించాడు ఇంద్రుడు.

కైలాసనాధుని దర్శించడానికి తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంతో అహంకారంగా మాట్లాడిన ఇంద్రుడు నందిని విస్మరించి లోపలికి ప్రయత్నించాడు. నంది దేవుడు అతనిని మళ్లీ అడ్డగించాడు. అడ్డుగా నిలబడిన నంది దేవుడిని దారి నుండి తప్పించి కైలాసం లోపలికి అడుగుపెట్టడానికి ప్రయత్నించాడు దేవేంద్రుడు.

తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించడంలో బాధకరంగా ఉన్న ఇంద్రుడు ఎదపై కాలితో తన్నాడు నంది దేవుడు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఆలోచించని దేవేంద్రుడు గాయపడి, జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. భూలోకంపై పడ్డాడు ఇంద్రుడు.

చాలాకాలం అతని జ్ఞాపకశక్తి మెరుగపడలేదు.ఆహార పానీయాలు లేకపోవడంతో ఇంద్రుడు తన శక్తిని కోల్పోయాడు. ఆ సమయంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో కోటి సూర్యప్రకాశం కనిపించింది. ఆ కాంతి ఇంద్రుడికి ఈ విధంగా ఉపదేశించింది. సూర్యనారాయణుడి ఒక ఆలయాన్ని నిర్మించే పూజలు జరిపితే అతని గాయం నయమైపోతుందని, నొప్పి నుండి ఉపశమనం కల్గుతుందని తెలిపింది.

కల చెదిరింది. ఇంద్రుడు వాస్తవానికి వచ్చాడు. మూర్చపోయి పడి వున్న చోటు తన వజ్రాయుధంతో దాడిచేశాడు. అంతదాకా భూదేవి తనలో దాచుకున్న ఓ విగ్రహం బయటపడింది. అది అందమైన సూర్యనారాయణుడి విగ్రహం. ఆ విగ్రహాన్ని వెలికితీసిన దేవేంద్రుడు ప్రతిష్ఠ చేయడానికి కాశ్యప మహర్సిని కలుసుకున్నాడు. భూలోక వాసుల క్షేమం కోరి ఆయన దానిని అక్కడ ప్రతిష్ఠ చేశాడు.

కాశ్యప మహర్షి ప్రతిష్ఠ చేసినందువల్ల సూర్యుడు కాశ్యపగోత్రానికి చెందినవాడంటారు. పురాణాలు కూడా సూర్యుడు కాశ్యప మహర్షి కుమారుడని పేర్కొంటాయి. క్రీ.పూ. 7వ శతాబ్దం కళింగ దేశాన్ని పాలించిన దేవేంద్ర వర్మ అనే రాజు సూర్యనారాయణుడి విగ్రహానికి గర్భగుడి కట్టించి ఆలయాన్ని నిర్మించారు.

కళింగ శిల్పకళాశైలిలో నిర్మించిన ఈ గోపురానికి వున్న 5 ద్వారాలనూ దాటి వెళ్తే గర్భగుడి కనిపిస్తుంది. మార్చ్గి 9, 10, 11,12 మరియు అక్టోబర్‌ 1, 2, 3, 4 తేదీలలో ప్రాత:కాల సమయంలో ఆలయంలోని ఐదు ద్వారాలనూ దాటి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకి పాదపూజ చేస్తాయంటారు.

విశ్వకర్మ వంశానికి చెందిన శిల్పులు ఈ ఆలయంలో ఈ మహత్తరమైన శిల్పకళా చాతుర్యానికి కారకులు. ఆలయం లోపలికి ప్రవేశించగానే ధ్వజస్తంభం ఆ తర్వాత గరుడ భగవాన్‌ సన్నిధి. దాని ఎదుట ద్వారాన్ని దాటి ముందుకెళ్తే గర్భగుడిలో సూర్యనారాయణస్వామి.

అరుణశిల అనబడే నల్లటి సాలిగ్రామం రూపంలో స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మూల విగ్రహానికి కింది భాగాన మడర మరియు పింగళ అనబడే ద్వారపాలకులు విగ్రహాలున్నాయి. పక్కనే సనక, సనాతన మహర్షుల విగ్రహాలున్నాయి. పద్మిని, చాయాదేవి మరియు ఉషాదేవి సమేత సూర్యనారాయణుడు రెండు హస్తములలో కమలాలతో దర్శనమిస్తాడు. స్వామివారి రధంపై ఏడు గుర్రాలతో అసూరుడనే సారధితoోపాటు దర్శనమిస్తాడు.

ఆరోగ్యంకొరకు ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన స్వామికి సూర్యనమస్కారం చేస్తే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఆలయంలో సూర్యనమస్కారం చేసే భక్తులు ఋగ్వేద, యజుర్వేద బీజాక్షరాలతో అరుణమంత్రాన్ని, మహాశౌర మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రాలు పఠించేవారు ఆరోగ్యభాగ్యం పొంది ఆనందంగా జీవించగలరు. అందుకే సూర్యభగవానుడు ఆరోగ్యాన్నిచే దేవునిగా ఈ భూలోకంలో ప్రసిద్ధి గాంచినాడు.

ఎడమనుండి కుడివైపుకి ప్రాకారాన్ని ప్రదక్షిణవేసి వస్తే ముందుగా దుర్గాలక్ష్మి సన్నిధిని చూడవచ్చు. బయటి ప్రాకారంలో, గర్భగుడి వెనుకవైపున ఆంజనేయస్వామి ఒక ప్రత్యేకమైన సన్నిధిలో దర్శనమిస్తాడు.

గర్భగుడి బయట ఎడమవైపున సూర్యనారాయణస్వామిని ప్రతిష్ఠ చేసిన దేవేద్రుడికి ఒక ప్రత్యేకమైన సన్నిధి. సూర్యనారాయణ స్వామిని పూజిస్తే కంటి వ్యాధులు, చర్మవ్యాధులు నయమైపోతాయని అన్ని మతాల భక్తులు ఆదివారం విషేష పూజలు జరిపిస్తారు. వైశాఖ, కార్తీక, మాఘమాసాలలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

పచ్చని పంటలు పెరగడానికి కారణభూతుడైన ఆ సూర్య భగవానుని ఆశీస్సుల కోసం భక్తులు పుష్యమాసము నందు సంక్రాంతి పండుగకు ఈ క్షేత్రానికి వచ్చి పూజలు జరిపిస్తారు. రధసప్తమి పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది.

అన్ని గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి ఆలయం ఈ శ్రీకాకుళం లో వెలిసిన ఈ క్షేత్రాన్ని అరసవిల్లి ఆలయం అని కూడా అంటారు. హర్షవిల్లి కాలక్రమేణా అరసవిల్లి అయింది. అంటే ఆనదానికి మూలం ఈ క్షేత్రం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: