telugudanam.com

      telugudanam.com

   

శ్రీశైలం

కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు - నల్లమల కొండలు. ప్రకృతి అందాలన్నింటినీ ఈ మహారణ్యంలో దాచుకున్నది. పర్వతారణ్య ప్రాంతంలో శివుడు పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున కొండ కొమ్మన వెలసిన, పురాణ ప్రసిద్ధమైన అనాది శివక్షేత్రము. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుండి బస్సులు నడుస్తూవున్నాయి. కొన్నాళ్ళ క్రిందట వరకు జీర్ణావస్థలోనున్నా ఇటీవల ఆలయం పునరుద్ధరించబడింది. కొండపైకి నేరుగా చక్కటి రోడ్ వేయబడి యాత్రికుల సందర్శనార్ధం బహు రమణీయంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయ ప్రశస్తి అనేక విధాలుగా పురాణాల్లో సైతం చెప్పబడినది.

శ్లో || మైనాకం మంధరం మేరుం | శ్రీశైలం గంధమాదనమ్

పంచశైలా పఠేన్నిత్యం | మహాపాతక నాశనమ్ ||


అని కేవల స్మరణ మాత్రంగానే మహాపాతకాలను నిర్మూలించ గలదని ప్రతీతి.

శ్లో || కేదారే హ్యుదకం పీత్వా | వారణాస్యాం మృత స్తథా

శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే.


కేదార క్షేత్రంలోని నీటిని ద్రావినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరం దర్శించినా పునర్జన్మం లేదు - అని చెప్పబడింది. ఇంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో మొట్ట మొదటిది.


ముఖ్యమైన ఉత్సవాలు

మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు.

శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టటం అనీ అంటారు - మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొ || 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి కరెక్టుగా ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు.


క్షేత్ర వైభవం

శివుడు

ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు.

ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది.

వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: