telugudanam.com

      telugudanam.com

   

ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యక్షేత్రం. విజయవాడ నుండి ఏలూరు బస్సులోగాని, రైలులోగాని వెళ్ళవచ్చును. మద్రాసు, హౌరా రైలు మార్గంలో ఏలూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మొదటి స్టాపింగు అవుతుంది. నిరంతరం ఏలూరుకు విజయవాడ నుండి నాన్ స్టాపు బస్సులు గలవు. ఏలూరు నుండి భీమడోలు, తడికలపూడి ద్వారా ద్వారకా తిరుమల చేరవచ్చును.

ఇక్కడ ఒక చిన్న గుట్ట మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్ట కింద గ్రామాన్ని తిరుపతి అంటారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి చెల్లించాలనుకున్న మొక్కుబడులు కూడా ఒక్కో సమయంలో అంతదూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడనే స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొంటూంటారు. భక్తులు విశేషంగా వస్తారు. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ వివాహ, ఉపనయనాది కార్యక్రమములు, అన్న ప్రాశనలు, వగైరాలు, తలనీలాల మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.

శేషాచలము, అనంతగిరి అని పిలువబడే ఈ ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఇక్కడ ఒక కుంకుడు చెట్టుంది. ఈ చెట్టు మీద గరుడ పక్షి కొన్ని సమయాల్లో వచ్చి వ్రాలుతుందట. ఆనాడు శ్రీవేంకటేశుడు తిరుపతి నుండి ద్వారకా తిరుమలకి వస్తారని ప్రతీతి. అక్కడ ద్వారక మహర్షి స్వామివారు నర్తిస్తుంటే ఒక వల్మీకం (పుట్ట) పెరిగిందని, ఆ పుట్టలో స్వామి వున్నట్లున్న పాద ముద్రికలు ఇప్పటికి కనబడుతున్నాయట. ఇక్కడ దొరికే ప్రతిశిల యందు సుదర్శన ముద్ర కన్పిస్తుంది. ఇది చాలా గొప్ప విశేషమయిన సంగతి. ఆలయ సింహద్వారములు వేసినా, మబ్బుపట్టి చీకట్లు కమ్ముకొన్నా ఆలయగోపురము నుండి ఒక దివ్యమైన జ్యోతి దర్శనమిస్తుంది. దగ్గర నుంచి అయితే చిన్న దీపంగాను 200 మీటర్ల దూరం నుంచి చూస్తే పెద్ద వెలుగుగాను చూడవచ్చు. అందుకు కారణం ఈ పర్వతంలో తేజోమణి ఉన్నదని భక్తులభావన. స్వామి వారికి లక్షణమైన సువర్ణాభరణాలు చాలా వున్నాయి. అనేక ఉత్సవాలు అతివైభవంగా జరుగుతాయి.

చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల సుదర్శనక్షేత్రం. వేంకటేశ్వర స్వామి స్వయంభువుగా ఇక్కడి శేషాద్రి కొండ పై వెలిశారని చీమల పుట్టలో ఉన్న స్వామి విగ్రహాన్ని 'ద్వారక' అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ఒకే గోపురం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. స్వామి అసలు విగ్రహం వక్షస్థలం వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం కొండలోనే నిక్షిప్తమై ఉంది. కింది భాగంలో ఉన్న శ్రీ వారి పాదాలను పాతాళలోకంలో ఉన్న బలి చక్రవర్తి పూజించుకుంటాడని భక్తుల నమ్మిక. స్వామి వెనుక భాగంలో ఉండే పూర్తి విగ్రహాన్ని పదకొండో శతాబ్దంలో శ్రీమద్రామానుజుల వారు ప్రతిష్ఠించారని చెబుతారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మైలవరం జమిందార్లు నిర్మించారు.

ఈ విధంగా గోదావరి జిల్లాలు రెండిటిలో విశేషమైన ప్రభావం గల పురాణ ప్రసిద్ధమైన ఎన్నో ఆలయాలున్నాయి. గోదావరి జిల్లాల్లోనే ఒక రకమైన జ్ఞానదాన మహత్యం ఉందని ప్రతీతి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: