telugudanam.com

      telugudanam.com

   

గయ

పాట్నా నుండి గయకు సుమారు, 206 కి.మీ. దూరం. హిందువులకు చాల ముఖ్యమయిన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. గయలో శ్రాద్దం పెడితే ఇక జీవితమంతా పితృ దేవతలకు శ్రాద్ద విధులు నిర్వర్తించవలసిన అవసరమే లేదంటారు. ఇక్కడ శ్రాద్ద విధులను నిర్వర్తించి పిండ ప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్ష ప్రదమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఒక్క క్షణం దారిలో ఉన్న ఆసక్తికరమైన స్థల సందర్శనం చేసికొంటూ వెళదాం.


గయ క్షేత్రం

గయ జిల్లాకు ముఖ్యపట్టణం. ఫల్గునీ నదీతీరంలో అమరియున్న పట్టణం. నది ఎండిపోయిన అంతర్వాహినిగా ప్రవహిస్తుందట. గయ అనేపేరు శ్రీ మహావిష్ణువు భక్తుడైన గయాసురుని నుంచి వచ్చింది. గయాసురుని ఋజువర్తనం చూచి దేవతలు ఈర్ష్య చెందారట ఈర్ష్యాశువులైన దేవతలు గయాసురుడు లేవకుండా అతని మీదనే తిష్ట వేయాలని చూచారు. ఈ విషయం తెలిసిన గయాసురుడు దేవతలను ప్రసన్న భావంతో ఉండమని, వారేం కోరితే అది యివ్వగలననీ, వారికోరిక ప్రకారం అక్కడే భూమిలో ఉంటాననీ కానీ సకల దేవతలు తనని అనుసరించి స్థిర నివాసం చేయాలని కోరాడట. ఆ విధంగా దేవతలందరూ అతని శరీరాన్నే అంటుకుని ఉండే విధంగా వరం యిచ్చారు. ఆ పిదప ఈ క్షేత్రంలో గయాసురుని ఖననం చేశారట. అతని పేరుమీద గయాసురుని త్యాగ నిరతికి, శాంతస్వభావానికి, ఋజువర్తనకుగుర్తుగా యీ నాటికీ అది అతిపవిత్ర స్థలముగా కొనియాడబదుతోంది.

కాశీలో మాదిరిగానే ఇక్కడ గయావర్ణనం అనేపేరిట, యాత్రికులు శాక, ఫల వర్ణనం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పండాలు మంత్ర యుక్తంగా శాస్త్రోక్త విధిని చేయిస్తారు. గయావర్ణనము ముఖ్యంగా విష్ణు పాదాలయం వద్దగాని, అక్షయ వటం దగ్గరగాని చేస్తారు.


విష్ణు పాదాలయం :

పాతగయలో ఫల్గునీ, మాధురస్వేదా నదుల సంగం దగ్గిర ఉన్నది. ఈ ఆలయాన్ని 1787 సం||లో ఇండోర్ మమహారాణి అహల్యాబాయి కట్టించారు. 30 మీటర్లు ఎత్తుగల గాలిగోపురంతో సమున్నతంగా తలెత్తి దర్శనమిస్తుంది. హిందువులకు మాత్రమే ప్రవేశం. అన్య మతస్థులు రావటానికి వీల్లేదు. నదీతీరంలో అనేక స్నాన ఘట్టాలున్నాయి. వర్షాకాలంలో అయితే నీరు నదిలో పుష్కలంగా ఉంటుంది. మిగతా రోజుల్లో నీరుండదు. ఈ నది ఒడ్డునే శవదహన కార్యక్రమాలు గూడ నిర్వహిస్తుంటారు. ఆలయంలో 13 అంగుళములు గల విష్ణుపాదం ముద్ర రాతితో చేసినది వెండిపళ్ళెరంలో ఉంచారు. విష్ణువు గజ అనే రాక్షసుని తన కుడిపాదంతో హతమార్చాడట. సభామందిరం చాల విశాలం. మధ్య ఒక పెద్ద గంట వ్రేలాడుతుంది. తూర్పుగా హనుమాన్ విగ్రహం ఉంది.


గదాధర భగవాన్ ఆలయం :

గదాధరుడు చతుర్భుజములతో మూర్తీభవించి దర్శనమిస్తాడు. ఇటువంటి మూర్తి మరి యెక్కడా లేదని ప్రతీతి. ఇది గదాధర్‌ఘాట్‌లో ఉన్నది.

సూర్యభగవానుని ఆలయం -1000 మెట్లెక్కి చిన్న గుట్ట మీద అమరియున్న పెద్ద కోనేరు. ఆ కోనేరుకి పడమటి దిక్కున నాలుగు భుజములుగల సూర్యభగవానుడు ఉన్నాడు. ఇక్కడ పిండములు వేయుదురు. ఈ కొండ మీదనుండి గయ పట్టణం మొత్తాన్ని వీక్షించవచ్చు. కృష్ణద్వారక - కృష్ణాలయం, నారదగంజ్ ఘాటుకు దగ్గరలోని త్రిజోగినాధ ఆలయం చూడదగినవి. పాతగయకు ఉత్తరంగా ఉత్తర మానస్ కొలను ఉంది. ఇక్కడ కూడా పిండ ప్రదానములు చేస్తారు. ఇంకా సీతా కుండు, రామగయ, రామశిలా పర్వతం, భాగేశ్వరి ఆలయం, సంస్కృత కళాశాల వగైరాలున్నాయి.


అక్షయ వటము :

విష్ణుపాద, బ్రహ్మ యోనీ పర్వతాల మధ్య త్రేతాయుగము నుండి ఉన్నదట, వారణాసిలో మొదలయిన శ్రాద్దవిధులు - గయా శ్రాద్దములు పూర్తి అయిన తరువాత ఈ వృక్షము క్రింద పితృకర్మలు చేయించి పిండ ప్రదానములు చేయిస్తారు. అప్పటికిగాని పితృదేవతలకు శాశ్వత కైవల్యం సాధ్యంగాదని గాఢమయిన నమ్మిక. ఇక్కడే మంగళగౌరి అష్టాదశ పీఠాల్లోని 13వ పీఠం ఉంది. ఇంకా బ్రహ్మయోని, మాతృయోని మొదలయినవి గూడ పవిత్రమయినవి.


మహా బోథి ఆలయం :

ఈ ఆలయం పిరమిడ్ ఆకారంలో 50 మీటర్లు ఎత్తున ఒక బ్రహ్మండమైన కట్టడం. దీనికి అంకురార్పణ అశోక చక్రవర్తి చేశాడు. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 635లో హూయాన్‌త్సాంగ్ చూచానని తన వ్రాతల్లో వ్రాసుకొన్నాడు. దరిమిలా పదకొండవ శతాబ్దంలోను, 1882 శతాబ్దంలోను పునరుద్దరించబడి ప్రస్తుత స్వరూపం ఉన్నా సహజంగా 7వ శతాబ్దంలోను వున్న స్వరూపం కూడా ఇదేనని చెప్పుకుంటారు. తూర్పువైపున తోరణ ప్రవేశద్వారం గుండా ఆలయ సభా ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చు. ఆలయం బౌద్ధ శిల్పశైలికి మచ్చు తునక. ఆలయంలో బుద్ధ విగ్రహం చాలా పెద్ధది. ఇక్కడి కొన్ని శిలా శిల్పాల ఖండాలు కలకత్తాలోని విక్టోరియా మ్యూజియంలోను, లండనులోని ఆల్బర్టు మ్యూజియంలోను ప్రదర్శనలో ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడే వివిధ దేశాలనుంచి తరలించి తెచ్చిన బుద్ధ విగ్రహాలతో బుద్ధ ఆశ్రమాలు కూడా ఉన్నాయి.


సిద్ధేశ్వర ఆలయం :

గయా స్టేషను నుండి సుమారు 20 కి.మీ. దూరంలో బేలా రైల్వే స్టేషను సమీపంలో తూర్పు దిశన బారాబర్ పర్వతమున్నది. ఎత్తయిన ఈ పర్వత శిఖరం మీద బారా రాజు ఆలయ నిర్మాణం చేశారు. సిద్ధేశ్వర లింగమును రాత్రులందు ఆరాధిస్తారు. అనంత చతుర్ధశి ఉత్సవాలు మహావైభవోపేతంగా జరుగుతాయి. పర్వతం దిగువనే 'నాట్‌ఘర్' అనే పేరుతో ఏడు గుహలున్నాయి. పాతాళగంగ అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప బుద్ధ విగ్రహం ఉన్నది. ఒక గుహ మాత్రం అసంపూర్తిగా ఉన్నది. మూడు గుహలు ఒక సముదాయంగాను, మూడు గుహలు మరో సముదాయముగాను ఉండి వింతయైన మెరుగులతో అద్భుతాశ్చర్యాల కాలవాలమై యున్నాయి.

మూలం: సంపూర్ణ భారతదేశ యాత్రా మార్గదర్శిని.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: