telugudanam.com

      telugudanam.com

   

కదిరి లక్ష్మీనరసింహస్వామి

క్షీరసాగరమందు భుజంగం పై శయనించే పరంధాముని దశావతారములో నరసింహా్వతారం మిగిలిన అవతారాల కంటే విశిష్టమైనది. రామావతారం, క్రిష్ణావతారాలలో భూమిపై కొంత కాలం మానవాకారంలో జీవించిన విష్ణువు నరసింహావతారం స్వల్పకాలం లోనే ముగించాడు.

మిగిలిన అవతారాలు ప్రజలక్షేమం కొరకో లేదా భక్తులను కాపా్డుట కొరకో అవతరించినవి. అయితే ఈ నరసింహావతారం ఒక అనుర కులంలో జన్మించిన ఒక భక్తుని కొరకు, అతని పవిత్రమైన భక్తికి దేవుడి కానుకగా భూలోకంలో అవతరించెను.

నరసింహావతారంలో ఆ స్వామి సగ భాగం మృగంలా, మిగతా భాగం మానవ రూపంలో, ఉగ్రంగానూ, ఆవేశంగానూ భూలోకానికి తన భక్తునికొరకు వచ్చి ఆ తర్వాత ప్రశాంతతను పొంది, అక్కడక్కడ దర్శనమిచ్చి కొలువై వున్నాడు.

శాంతమూర్తిగా ఆ స్వామిని దర్శించిన భక్తులు పొందిన సంతోషాన్ని, వారికి దక్కిన మహద్భాగ్యాన్ని మిగిలిన భక్తులకు దక్కేందుకు సాలగ్రామం రూపంలో భూలోకంలో వెలిశాడు. అలా స్వామివారు కొలువైన పుణ్యక్షేత్రమే కదిరి. మరి స్వామి ఈ క్షేత్రానికి విచ్చేసిన వైనం తెలుసుకుందామా?

హిరణ్యకశికుడిని రెండు భాగాలుగా చీల్చివేసి, సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి క్రోధం తగ్గలేదు. దేవతలు, మహర్షులు శ్రీ కంబాలరాయని దుర్గమునకు దక్షిణమున వున్న పర్వతము ఉగ్రనరసింహస్వామిని "యోవాన్య హింసీజ్జరయా" మొదలగు స్తోత్రములచే వేదోక్తముగా స్తుతించి ఆ స్వామి రౌద్రావతారాన్ని ఉపశమింపజేయుటచే ఈ పర్వతాన్ని స్తోత్రాది అన్నారు.

భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కొరకు తపస్సు చేయగా స్వామి వారు ప్రసన్నమై "మహర్షి నేను ఈ భృగు తీర్ధము నందు కొలువైయున్నాను. ఆర్చాబింబముగా వున్న నా ప్రతిబింబములను నీవు ఆరాధించి లోకమునకు వెల్లడించమని ఆజ్ఞాపించాడు.

భృగు మహర్షి తీర్ధమందున్న ఆర్చాబింబాన్ని వసంత ఋతువు నందు వెలికితీసి ప్రాణప్రతిష్ట చేసి "వసంత వల్లభులు" అను నామధేయమును గావించి ఆరాధించారు.

కృతయుగమందు ప్రతిష్ట చేయబడ్డ మూర్తి కాలగర్భంలో కలిసిపోయింది. కలియుగంలో పదవ శతాబ్దమున పట్నం పాలేగారగు రంగనాయకుల వారి గోవులు ఖదిరి వృక్షము కింద వున్న పుట్టలోని సాలగ్రామములకు తమ పాలతో అభిషేకము చేయచుండెడివి.

గోవులు ఎక్కడో పాలిచ్చి వచ్చినా, పాలేరు గారు పశు సంపదతో పాటు సకలైశ్వర్యాభివృద్ధి గావించినారు.

ఇది ఆ స్వామివారి లీల అని తెలియని రంగనాయకులకు ఒకరాత్రి శ్రీ నృసింహస్వామి స్వప్నము నందు కనిపించి తనకు గర్భగృహము నిర్మాణము గావింపమని ఆదేశించాడు. రంగనాయకులు గోవులను వెంబడించి కదిరి వృక్షము నందు ఎవరికి కనిపించకుండా వున్న అర్చాబింబాన్ని వెలికితీసి అక్కడే గర్భగుడిని నిర్మించారు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో అర్ధమండపం, గోపురములతో బుక్కరాయలు ఆలయం నిర్మించాడు.

కదిరి వృక్షము కింద వెలసీం స్వామి వారున్న ఈ ఊరు కాలక్రమేణా కదిరి అయింది. ప్రసిద్ధి చెందిన ఈ కదిరి క్షేత్రం అనంతపురం నుండి 93 కి.మీ దూరమున కలదు. నలువైపులా గోపురాలతో వున్న ఈ ఆలయం ఎంతో అందంగా నిర్మించబడింది. గోపుర ద్వారం దాటి లోపలికి వెళ్తే కుడివైపున సీతారామలక్ష్మణుల విగ్రహాలున్న సన్నిధి దర్శనం ఇస్తుంది. గర్భగుడిలో నరసింహస్వామి.

అష్టభుజాలు, హిరణ్యకశకుడిని తొడపై పెట్టుకుని తన రెండు చేతులతో అసురుణ్ణి తలను, కాళ్లను పట్టుకున్నట్టున్న విగ్రహం. మిగతా రెండు చేతులతో పదునైన గోళ్ళను చూడచ్చు. మిగతా నాలుగు చేతులతో శంఖు, చక్రం, ఖడ్గం మొదలైనవి ఉన్నాయి. పదునైన కోర పళ్లు కూడా కనిపిస్తాయి.

ఏ అవతారం హిరణ్యకశిపుడిని అంతమొందించిందో అదే అవతారం ఇప్పుడు భక్తులను కరుణించి కటాక్షిస్తోంది. ఏ నేత్రాలు ఆ అసురుడిని రౌద్రంగా వీక్షించాయో అవే నేత్రాలు ఇప్పుడు భక్తులను కరుణతో వీక్షిస్తున్నాయి.

స్వామివారికి అలంకరించిన అమూల్యమైన ఆభరణాలతో దర్శించే భక్తులు జన్మ తరించిపోతుంది. స్వామి వారికి పక్కనే భక్తితో ప్రణమిల్లుతున్న ప్రహ్లాదుడు. ఈ క్షేత్రములోని స్వామి స్వయంభువు. దానికి నిదర్శనగా అభిషేకానంతరం స్వామివారి హృదయ భాగంపై స్వేద బిందువులు ఏర్పడతాయట. గర్భగుడి ప్రకనే సన్నిధికి ఎడమవైపు శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు అలంకారాలతో ఎంతో అందంగా దర్శనమిస్తాయి.

గర్భగుడికి ఎడమవైపున అమృతవల్లి దేవి ఆలయం. దేవి ఆలయానికి ఎదుటనున్న మండప స్తంభాలపై చిన్న శిల్పాలున్నాయి. నరసింహస్వామి అందానికి పోటీ పడేట్టున్న అమృతవల్లి విగ్రహం వజ్రపు ముక్కుపుడక నొసట తిలకము వజ్రపు ప్రకాశం తలదన్నేట్టుగా వుంది. ఉత్సవ విగ్రహం గజలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది.

అమ్మవారు ఎదుట శ్రీచక్రం ప్రతిష్టించారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు సకల ఐశ్వర్యాలతో సుఖంగా జీవించగలరు. అందుచేతనే ఈ ఆలయానికి ఎప్పుడూ కిక్కిరిసే భక్తజన సందోహం. బయటకి వస్తే అశ్వర్ధ వృక్షం కింద ప్రతిష్ట చేసిన నాగవిగ్రహాలు. ప్రాకారాన్ని ప్రదక్షిణచేసి వస్తే అర్ధమండపం. ఎడమవైపున్న నీడనిచ్చే రెండు మహావృక్షాలు.

ఇక్కడ ఎప్పుడూ ప్రసాదాలు పంచిపెడుతుంటారు. స్వామివారి దివ్యదర్శనం తర్వాత పొందిన ఆనందం భక్తుల ముఖారవిందాలలో తేటతెల్లమైపోతుంది. మహావృక్షాల నీడన కూర్చుని ప్రసాదాలను భక్తితో ఆరగిస్తారు.

నరసింహ జయంతి, దసరా పండుగ, మల్లేపూల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ క్షేత్రానికి వెళ్లి నరసింహ స్వామిని దర్శించిన వారికి స్వామివారు ఆ ప్రహ్లాదుని అనుగ్రహించినట్టే భక్తుల కోరికలు నెరవేర్చి వారి కష్టాలను తీర్చి మోక్షప్రాప్తి తప్పక కల్గిస్తాడనడం అతిశయోక్తి కాదు. స్వామివారిని దర్శించి తరించండి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: