telugudanam.com

      telugudanam.com

   

కాంచీపురం, కంజీవరం- కంచి నామాంతరాలు

ఇది ఒక దివ్యదేశం - ముక్తి క్షేత్రంగా కొనియాడబడిన సప్తమోక్షదాయక పురులలో ఒకటిగా పురాణ ప్రసిద్ధి గలది. మద్రాసు మహానగరానికి సుమారు 75 కి.మీ. దూరంలో నైఋతిదిశగా చెంగల్పట్టు జిల్లాలో అమరియున్నది. ఆ పేరు ఎత్తగానే పండుగలు వివాహాది ప్రత్యేక సందర్భాల్లో ధరించే వైభవోపేతమైన కంచిపట్టు చీరెలు మనస్సులో మెదులుతాయి. వెండిజరీలతో బంగారు రంగు రంగు నగిషీపనుల సోయిగాలు అనంతం, విశేష ప్రఖ్యాతితో ఈ నాటికీ విరాజిల్లుతున్నాయి.


ఏకాంబరేశ్వర దేవాలయం:

శివాలయం, పంచలింగాల్లో పృధ్వీలింగం. ఐదు ప్రాకారాలున్నాయి. ఆలయం అంకురార్పణ పల్లవులు చేశారు. దాని అభివృద్ధి క్రమంలో చోళులు, విజయనగరరాజులు ఇతోధికంగా పాల్గొన్నట్లుగా దాఖలాలున్నాయి. ఆలయం మొత్తం వైశాల్యం 25 ఎకరాలలో అమరియున్నది. ఆలయంలో 1000 స్తంభముల మంటపం ఉన్నది. దానికితోడు మెట్లు అమర్చబడిన కోనేరు, ఒక పెద్దమామిడి చెట్టు ఉన్నాయి. ఆ చెట్టుక్రింద పార్వతి అమ్మవారు తపస్సు చేసినట్లు పురాణకథ. మొదటి ప్రాకారం మీద ఒక పెద్ద గాలిగోపురం ఉంది. దానిని 1509లో శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినట్లుగా ప్రతీతి. అందులోవున్న 13 తీర్ధములలో సరస్వతీ తీర్ధము ముఖ్యమయినది.


శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం:

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతింది. ముచ్చటగా మూడు గోపురాలున్నాయి. అమ్మవారి వాహనం సింహం ధ్వజస్థంభంమీద ఉన్నది. అమ్మవారు త్రినేత్రియై మహారౌద్రంగా ఉండేదట. రెండు కండ్లును ఆదిపరాశక్తి వర్ణనలో సూర్య చంద్రులకు ప్రతీకలుగా చెప్పబడి - మూడవ నేత్రం అగ్నినేత్రంగా భావించబడుతుంది. ఉగ్రమైన అమ్మవారి శక్తి నరబలులు కోరుతుండటం తత్‌శాంతి పరిహరార్ధము ఆదిశంకరుల వారు తమ స్వహస్తాలతో శ్రీ చక్రమును స్థాపించినట్లుగా చెప్పుతారు.ఆ జ్ఞాపకార్ధంగానే ఆదిశంకరుల ప్రతిమ కూడ ఆలయంలో ప్రతిష్టించబడింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాలల్లో జరిగే రధోత్సవం చాలా విశేషం. ఆసంఖ్యాకంగా యాత్రికులు భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే అమరియున్న వామన దేవాలయం చూడదగింది. బలిచక్రవర్తి దానమడిగిన వామనమూర్తి విశ్వాన్ని మొత్తాన్ని అక్రమించినట్లు చూపిస్తున్న విగ్రహం చాలా పెద్దది. వామనుని ముఖం సరిగా కనబడదు. పైకి ఒక కర్రసాయంతో దీపం వెలిగించి పైకి పట్టుకొని చూపుతారు పూజార్లు.


శ్రీ కైలాసనాధ ఆలయం:

7వ శతాబ్ధంలో పల్లవ చక్రవర్తి రాజసింహుడు మొదలు పెట్టగా అతని కుమారుడైన 3వ మహేంద్ర వర్మ దానిని పూర్తిచేశాడు. పల్లవుల కళావైదగ్ద్యం పరిణతి పొందిన వైనం అక్షరాలా దీపించే కట్టడంగా చెప్పుకోవచ్చు. విశాలమైన నడవాలు, ఆవరణంలో స్తంభాలతో కట్టబడిన మంటపాలు అన్నిటినీ చుట్టుకుని వచ్చే ప్రహరీ గోడ, అనేక గోపురాలతో వెలయించిన వైనం స్పష్టంగా కనపడుతుంది. బహుశా దక్షిణాది దేవాలయాల్లో తరువాతి తరాలకు చెందినవారు నిర్మించిన వానిలోని వందలు వేల స్థంభాల్తో నిర్మించబడిన మంటపాలకు పునాది అనుకోవచ్చు.


చిన్న కంచి -వరద రాజస్వామి వారి దేవాలయం:

కొంచం ఎత్తుగా ఉన్న కరిగిరి అనే గుట్టమీద అమరియున్నది. వైష్ణవాలయం దీన్ని 'హస్తిగిరి' అంటారు. విజయనగర రాజులు మహాఎత్తయిన ప్రాకారాలు గోడలు ఏర్పరిచారు. లోపల అధివసించియున్న ముఖ్యదైవము శ్రీవరదరాజస్వామి పైన వరదరాజస్వామి ఆలయం ఉంటే క్రింద నరసింహస్వామివారి ఆలయం ఉంది. వరదరాజస్వామి వారి ఆలయంలోని శతస్థంభ మంటపం చూడదగినది. విశిష్ట కళా నైపుణ్యానికి మచ్చుతునక మంటపంమీద చూరులో ఒక గొలుసు వేళ్లాడుతూ ఉంది. అది రాతితో చెక్కింది ఆశ్చర్యం గొలిపే శిల్పాలు ఎన్నో. ఈ ఆలయమున వెండి బంగారు బల్లులున్నాయి. ఈ బల్లులను తాకితే బల్లి పడిన దోషం ఉండదని గట్టి నమ్మకం. స్వామివారికి అనేక వాహనాలు, నగలు ఉన్నాయి.

ఇక్కడ దగ్గరిలోనే కొన్ని జైన, బౌద్దమఠములు, స్థూపములు, ఏకాంబరేశ్వర దేవాలయంలో చెక్కబడిన శిలా శాసనాలు చరిత్ర పరిశోధకులకు అత్యంతాసక్తికరం. అర్ధశాస్త్ర రచయిత కౌటిల్యుడు ఇక్కడనే జన్మించాడని ప్రతీతి. మే నెలలో జరిగే గరుడోత్సవం చాల విశేషం. శ్రీ త్యాగరాజస్వామి వారు 'వినతాసుత వాహనుడై వెడలెను-కంచి వరదు'డనే కీర్తనను ఈ ఉత్సవాన్ని దర్శించి పాడి తన్మయుడైనట్లుగా చెప్పుకొంటారు.


శ్రీ వైకుంఠ పెరుమాళ్ళు ఆలయం:

8వ శతబ్దంలో రెండవ నందివర్మ కట్టించి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశాడు. పల్లవుల శైలిలోని పరిపూర్ణత్వం ఈ ఆలయంలో చూడవచ్చు. కాంచీ పురంలో దేవాలయాలు 108గాను, చుట్టు ప్రక్కలగల దగ్గరిలోనే ఉన్న ఆలయాలు మొత్తం వేయికి మించి ఉంటాయని అంచనా. ఆసక్తి గలవారు అన్నీ చూడవచ్చు. చిన్న కంచి, పెద్దకంచిలతో గలిసి తొండదేశపు 22 దివ్యదేశాలుగా గణించబడిన వాటిలో 14 కాంచీపురంలోనే ఉన్నవట. కాంచీపురంలో హొటళ్ళు వగయిరాలు అందుబాటులోనే ఉంటాయి. ఎగ్మూరునుండి మీటరుగేజి లైనులోగల ఎలక్ట్రిక్ రైలుమీద పల్లావరం 4కి.మీ. దూరంలో దక్షిణదిశగా ఉన్న దివ్యదేశంగా పరిగణించబడే 'తిరునీర్మలై' అనబడే ఖండారణ్య క్షేత్రం దర్శనీయం. దగ్గరిలోనే వండలూరులో విజయనగరరాజ వంశీయులచే కట్టించబడిన దేవాలయాలు దర్శనీయం. ఆసక్తి గలవారు చూడవచ్చు.


మూలం: సంపూర్ణ భారతదేశ యాత్రా మార్గదర్శిని, బాలాజి బుక్ డిపో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: