telugudanam.com

      telugudanam.com

   

కన్యాకుమారి అగ్రము

స్వతంత్ర భారతదేశానికి దక్షిణపు కొన-అగ్రము. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తుతగ్గి, చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరకి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. ఇది దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు. రెండు మహా సముద్రాలను వేరుచేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ప్రపంచంలో మరెక్కడయినా ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నిత్యసత్యం - సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం. మూడు సముద్రాలు కలిసి ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో మిళితమై మెరిసే సంధ్యారుణకాంతులు గగనాన ప్రతిఫలించే తీరులు చూస్తేచాలదా జన్మసాఫల్యం! అందించదా జీవితాంతం చిరకాలం గుండెల్లో గూడుకట్టుకుని ఉండే ఆనందానుభూతి? ఈ మహత్తర దృశ్యాన్ని కనులారా చూడటానికి ఎన్నెన్ని దేశాలనుండి, ఎంతెంత దూరంనుంచి, వ్యయానికీ, ప్రయాసకీ ఓర్చి వస్తున్నారు ప్రజలు. ఇది ఎంతో అనాదినుండి అతి పవిత్రమైన స్థానంగా విశేషంగా ప్రశంసించబడి, ప్రస్తుతించబడి ఉన్నది.


కన్యాకుమారి ఆలయం:

సముద్రపు ఒడ్డున భారతదేశ పుణ్యక్షేత్రం మూడు సముద్రాలు ముమ్మూర్తులై ఆదిపరాశక్తి అవతార విశేషమయిన అమ్మవారి పాదపూజ చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. పదహారేండ్ల బాలిక స్వరూపంలో దుష్టులకు దుర్నీరీక్షయై, భక్తులకు ప్రసన్న సౌకుమార్యంతో మాతృదృక్కులతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ అవతారం వెనుక బాణాసుర వృత్తాంతం పురాణకథగా చెబుతారు. వీరబలగర్వోన్నతుడై చెలరేగిన దుష్టబాణాసురుని వధించుటకు మాత పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని, అది స్థానికంగా ఉన్న రాజకుమారిగా ప్రభవించి యుక్తవయస్సు రాగానే ఆమెకు వరాన్వేషణ మెదలయిందనీ, అంతలోనే ఆమె తన అవతారపు విశేష ఉనికిని తెలిసికొని శుచీంద్రంలో తపస్సులో నిమగ్నమయిన స్థానేశ్వరుని వచ్చి తనను పరిగ్రహించవలసిందిగా రాయబార మంపినదట. స్థానేశ్వరుడందులకు ఒప్పుకొన్నాడు. ముహూర్తం నిర్ణయమైంది కారణ జన్మురాలైన మాత పార్వతి వివాహమాడితే దుష్టరాక్షసుని దునుమాడటానికి ఈ అవతారంలో కుదరదు. కనుక ఈ వివాహాన్నెలాగైనా తప్పించాలి. ముహూర్తం సమయానికి పరమశివుడు యోగ సమాధిలోకి వెళ్ళేట్లుగా నారదుడు యుక్తిపన్నాడు. యుక్తి ఫలించింది ఇంతలో బాణాసురుడు కన్యయొక్క అందాన్ని గురించివిన్నాడు. ఆమెను తనకివ్వమని వత్తిడి తెచ్చాడు. కోట ద్వారంలోకొచ్చి ప్రేలాపన మొదలెట్టాడు. ఎవరూ దరిచేర సాహసించలేదు. అప్పుడు 16 సంవత్సరాల బాలికయైన రాజకుమారి బయటికివచ్చి బాణాసురుని సంహరించింది. ముహూర్తం దాటిపోయింది. పరమశివుడు యోగనిష్టలో అలాగేవుండిపోయాడు. కన్యాకుమారి కన్యగానే మిగిలిపోయింది. పరమశివుడు స్థానేశ్వరుడు ఇంకావస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. ఆలయం అంత పెద్దది కాక పోయినా విగ్రహం బహుసుందరమైంది. అమ్మవారికి అనేక మణులు మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాలెన్నో ఉన్నాయి. వాటిలో మహాప్రకాశమానమైన నాగమణి ఉంది. ఉత్సవసమయాల్లో మాత్రమే అలంకరిస్తారు. మిగతా రోజుల్లో అయితే నావికులను తప్పుదోవ పట్టిస్తుందేమోనని భద్రంగా తీసి దాచిపెడతారు. అసలు ఆలయం అత్యంత పురాతనమైనది. పురాతనమైన శిధిలాల మీద మరల పునర్నిర్మాణం జరిగింది. అదే యిప్పటి ప్రస్తుత ఆలయస్వరూపం. బాణాసురుని విజయాన్ని పురస్కరించుకుని అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు మహావైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతాయి.


మూలం: సంపూర్ణ భారతదేశ యాత్రా మార్గదర్శిని, బాలాజి బుక్ డిపో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: