telugudanam.com

      telugudanam.com

   

కేదారనాధ్

రిషీకేశ్ నుండి 250 కి.మీ దూరం ఉంటుంది. సోన్ ప్రయాగ వరకు బస్సు వుంటుంది. సోన్ ప్రయాగ నుండి తప్పనిసరిగా నడక సాగించవలసిందే. శ్రమకు ఓర్చుకొనగలిగేవారు, ప్రకృతి సౌందర్యాధకులు కఠినమైనా, దూరమైనా పర్వతాలు ఎక్కుతూ, దిగుతూ పర్వత గ్రామీణ ప్రాంతాలను స్పృశిస్తూ ఉత్సాహంగా నడిచి వెళ్లగోరేవారు, గంగోత్రి నుండి కేదార్ నాధ్‌కు వెళ్ళవచ్చు. ఉత్తరానికి 20 కి.మీ అవతలగా ఉన్న మాలా నుండి నడక మార్గం ప్రారంభమవుతుంది. లంకా, గంగోత్రిల ద్వారా వెళ్ళవచ్చు. దానికి ఈ క్రింది మార్గంగా వెళ్ళడానికి తయారయి వెళ్ళాల్సి వుంటుంది. ఇది మొత్తం 8 రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమం ఈ క్రింది విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. మాలా చేరిన తర్వాత...


మొదటి రోజు ప్రయాణం-మాలా నుండి బేలక్ ఖాల్-15కి.మీ
రెండవ రోజు ప్రయాణం-బేలక్ ఖాల్ నుండి బుడాకేదార్-14 కి.మీ
మూడవ రోజు ప్రయాణం-బుడాకేదార్ నుండి ఘుట్టు-16 కి.మీ
నాల్గవ రోజు ప్రయాణం-ఘుట్టు నుండి పన్వాలిఖంటా-12 కి.మీ
ఐదవ రోజు ప్రయాణం-పన్వాలిఖంటా నుండి మగ్గు-8 కి.మీ
ఆరవ రోజు ప్రయాణం-మగ్గు నుండి సోన్ ప్రయాగ్-9 కి.మీ
ఏడవ రోజు ప్రయాణం-సోన్ ప్రయాగ్ నుండి కేదార్‌నాద్-20 కి.మీ
ఎనిమిదవ రోజు ప్రయాణం-కేదార్‌నాద్ నుండి సోన్ ప్రయాగ్-20 కి.మీ

సోన్‌ప్రయాగ్ నుండి చివరి ఇరవై కిలోమీటర్ల దూరంలో 6 కి.మీ దూరం వరకు టాక్సీలో వెళ్ళవచ్చు. వచ్చేటప్పుడు కూడా అలాగే మరలా సోన్ ప్రయాగ్ చేరవచ్చు. కేదారనాధము అనాదిగా పురాణ ప్రసిద్ది చెందిన శివాలయం. సముద్ర మట్టానికి 11,500 అ. ఎత్తున మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల మధ్య అమరియున్నది. క్రింద నుండి లంబకోణంగా నేలమట్టం నుండి 22,850 అ. ఎత్తున నీలకంఠ పర్వతమనేది సృష్టి, స్థితి, లయల త్రిమూర్తులలో లయకారుడైన మహాదేవుని నివాసపు వెండి కొండలు, పంచశిఖరాలు గల ఈ శ్రేణి రుద్ర హిమాలయాలు లేక సుమేరు పర్వత శిఖరాలుగా పురాణాల్లో పేర్కొనబడ్డాయి. ధర్మరాజు తప్ప మిగిలిన పాండుపుత్రులందరూ తమ అంతిమశ్వాసను వదిలిన పవిత్రమైన చోటుగా ప్రసిద్దిచెందినది. గంగోత్రి, యమునోత్రిలలో ఉదకములను కేదారేశ్వరుని అభిషేకానికి తీసుకొని వస్తారు యాత్రికులు. ద్వాదశ జ్యోతిర్లింగములలో తొమ్మిదొవదిగా ప్రసిద్ది. సుమారు ఏడు మీటర్లు పొడవు, 70 సెం.మీ వెడల్పుగల శిల మీద 4 మీటర్లు ఎత్తున అమరియున్న శివలింగము, స్వామిని అందరూ తాకి స్వయంగా అర్చించుకోవచ్చు. పంచనదీ సంగమ స్థానమయి ముఖ్యంగా పావన మందాకినీ తీరంలో ఉన్న పవిత్రస్థలం. సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రం మే నుండి అక్టోబరు వరకు ఆలయం తెరచి ఉంచబడుతుంది.

శీతాకాలం ఆరుమాసాలు మూసి ఉంచబడుతుంది. ఈ సమయంలో సుమారు 40 కి.మీ దూరంలో ఉన్న ఊఖీ మఠంలో వుండి కేదారేశ్వరుని అర్చిస్తారు. ఆలయం మూయ బోయేముందు జ్యోతిని ఆలయం తెరచునంత వరకు అంటే ఈ ఆరుమాసాలు కూడా ఆరకుండా వెలుగుతుంది. ఇది గొప్ప విశేషం. ఆలయం వెనుక పర్వతాల నుండి పాండవులు ద్రౌపదితో గూడి స్వర్గారోహణ పర్వంలో చెప్పబడిన మహా ప్రస్థానమునకు వెళ్ళారని ఆ మార్గంలో వారి పాదచిహ్నాలు మనకు పండాలు చూపుతారు. ఈ మహాభారత కధానాయకుల విగ్రహములు, ద్రౌపది, కుంతీదేవి విగ్రహాలు ఆలయంలో చూడగలము. ఇక్కడ కూడా మంచు గడ్డల్లో ఉష్ణజలధారలు విశేషం. అనేక ధర్మశాలలు, హస్పిటలు, పోష్టాఫీసు మొదలైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పూజ్యశ్రీ శంకర భగవత్పాదులు ఆదిశంకరులవారు ఇక్కడనే సిద్ది పొందారని ప్రసిద్ది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: