telugudanam.com

      telugudanam.com

   

మధురై

కాంచీపురం మాదిరిగానే మదురై కూడా చాల పురాతన ప్రశస్తిగల పట్టణం. తమిళనాడులో మదరాసు మహానగరం తరువాత రెండవ పెద్ద నగరం. మీనాక్షిదేవి నివాసం. పాండ్యరాజుల రాజధానిగా విలసిల్లిన ఈ అనాదిపట్టణం ఆనాడూ, ఈనాడూ సరిసమాన ప్రతిపత్తిగల శాఖతో జిల్లా ముఖ్యకేంద్రమై వెలుగొందడం నిజంగా గొప్ప విషయం. ఒక గొప్ప పవిత్రస్థలమే గాకుండా మంచి సందడిగల వ్యాపార కేంద్రం. సంస్కృతీ సాంప్రదాయాల కాణాచి. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో మధురై నగర ప్రసక్తి వుంది. వస్త్రాలు, ముత్యాల వ్యాపారం బహు జోరుగ సాగించిన వైనం సుప్రసిద్ధం. క్రీస్త్రు పూర్వం నుండే విదేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలున్నాయని చరిత్ర చాటి చెబుతుంది.

అల్లాఉద్ధీన్ ఖిల్జీ మదురై పట్టణాన్ని దండయాత్ర చేసి దోచుకున్న వజ్ర, వైడూర్య, విలువైన బంగారు నగలను దాదాపు 500 మురుగులను తరలించుకుని పోవటానికి 500 ఏనుగులు, కొన్ని వేల గుర్రాలు వెంటబెట్టుకుని వచ్చాడట. అంతటి సిరులు దోచుకున్నా ఇంకా వన్నె తరగని పట్టణం. పాండ్యరాజుల పాలన క్షీణదశకు చేరుకున్న తరువాత విజయనగర సామ్రాజ్యంలోకి చేరిపోయింది. తరువాత మదుర నాయక రాజుల పాలనలో వుంది. మద్రాసునుండి, త్రివేండ్రంనుండి విమాన సౌకర్యాలున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రైలు, బస్సు మార్గాల కలయిక వుంది.


మీనాక్షి దేవాలయం:

మీనాక్షి దేవాలయం ఇక్కడ ముఖ్యంగా చూడదగింది. ఇది ఆలయం నగరంనడిబొడ్డున అమరిఉన్నది. అద్భుతమైన శిల్పనైపుణ్యం మరెక్కడా కానరాదు. మదురై పేరు రావటానికి ఒక కథ ఉంది.

ఒకానొకప్పుడు కారడవి. శివుడు తపస్సు చేసికోటానికి ఏర్పాటులో ఇంద్ర ప్రేరేపితమై మార్పు చెందింది. కళ్యాణపురి రాజుకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు అమృతం వొలికిస్తున్నట్లుగా కనబడింది. ఈ ప్రదేశాన్ని తన రాజధానిగా చేసికొని 'మధుపుర' మని పేరు పెట్టుకుని కాలక్రమేణా మదుర అయిందని ఒక కథ. దానికి తోడు మీనాక్షి పార్వతిదేవి అవతారం సుందర నయనాక్షి మీనాక్షి. రాజుగారికి ఏకైక అందాల బాలిక, రాజు సింహాసనంఎక్కిన మహిళ మహరాజ్ఞి. చుట్టుప్రక్కల కోరమీసాలుగల మగటిమి రాజులు కన్నెర్ర చేసి ఆడది-అబల గదాని కాలుదువ్వారు రాజ్యం మీద దండెత్తారు. అశ్వాన్నధిరోహించి మహారాజ్ఞి మీనాక్షి తీక్షణ వీక్షణాల్తో విసిరే ఖడ్గ ధాటికి ఒక్కరూ నిలబడలేకపోయారు. ఆమె శతృచ్చేదనంలో మునిగి ఆవేశంగా యింకా 'ఎవరూ ఎవరూ ' అంటూండేసరికి చెరగని చిరునవ్వుతో ఒక యువకుడు నిలుచున్నాడట. అతడే శివుడు. సుందరేశ్వరుడు. తన జన్మరహస్యం స్పురించిన మీనాక్షి అమ్మవారు తాను పార్వతీదేవి అంశగా మదిలో గుర్తించినదై తరువాత వివాహం చేసుకొన్నారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: