telugudanam.co.in

      telugudanam.co.in

   

‌మురమళ్ళ వీరేశ్వరస్వామి - భద్రకాళీ దేవి

దక్షుడు లోక సంరక్షణార్ధం చేస్తున్న ఒక యాగానికి అల్లుడైన పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు.

ఈశ్వరుడి భార్య దక్షుడి కుమార్తె అయిన దాక్షాయని తన భర్త అనుమతి పొందకుండా ఆ యాగానికి వెళ్లింది. దక్షుడు అవమానించగా హోమాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది.

ఆ తర్వాత కూడా ఆవేశం తగ్గక కోటి సూర్య ప్రకాశంతో తిరిగాడు వీరభద్రుడు. ఆ ఆవేశానికి భూమి అదిరింది. అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అగ్నికి ఆహుతయ్యాయి.

వీరభద్రస్వామి ఆవేశాన్ని తగ్గించే బాధ్యతను తన మరో రూపమైన భద్రకాళికి అప్పగించింది పార్వతి.

గౌతమి నది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని కొందరు మునులు నివసించేవారు. అందుకే ఆ ప్రదేశాన్ని మునిమండలి అని కూడా పిలిచేవారు.

అక్కడే ఆవేశంలో వున్న వీరభద్రుడు మదం పట్టిన ఏనుగులా తిరుగుతుండేవాడు. భద్రకాళి ఆ ప్రదేశానికి వచ్చింది ప్రక్కనే వున్న శరభయ్య చెరువులో మునిగి అతిలోక సౌందర్యతిలా కన్యారూపం దాల్చి వీరభద్రుడికి దగ్గరైంది.

ఆమెను చూసిన క్షణమే వీరభద్రస్వామి ఆవేశం కొద్దిగా తగ్గింది. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరభద్రస్వామి ఆవేశమూ తగ్గింది.

ఆనాటి నుండి వీరభద్రస్వామి దేవిని ప్రతిదినమూ కలుసుకునేవాడు. ఈ నిత్య కల్యాణానికి అగస్త్యముని, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతమ మహర్షి మొదలైన వారు వచ్చే వారని అంటారు.

వీరభద్రస్వామి దేవిని వివాహం చేసుకున్న ఆచోట ఒక ఆలయం వెలిసింది. ఆ తర్వాత గౌతమి నది ఉప్పెనవల్ల మునిగిపోయింది. లింగరూపంలో వున్న వీరభద్రస్వామి, భద్రకాళిదేవి విగ్రహం వెల్లువలో కొట్టుకునిపోయి గోదావరి నదిలో మునిగిపోయి అట్టడుగుభాగాన వుండిపోయాయి.

అప్పుడు కుమరగిరిని పాలించేవాడు శరభరాజు. ఆ రాజుకు స్వప్నంలో వీరభద్రస్వామి గోదావరి నదిలో తానున్నట్టూ తనను వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు.

ఆ రాజు తన పరివారంతో గోదావరి నదికి వెళ్లి నదిలో మునిగిపోయివున్న వీరభద్రస్వామిని వెలికితీసే ప్రయత్నంలో లింగంపై గునపం తగిలింది. రక్తం స్రవించగా గోదావరి నది ఎరట్రరి రంగులా మారిపోయింది.

ఆ సమయంలో ఆకాశవాణి "తాను గోదావరి అడుగున వున్నానని బయటికి తీసుకెళ్ళమని" పలికింది. రాజు అతని పరివారము లింగాన్ని వెలికితీశారు. కొంతదూరం తీసుకెళ్ళారు. అంతలో లింగం ఎవరూ మోయలేనంత బరువు పెరిగిపోయింది.

ఆ స్వామికి అదే చోటే సరైనదని నిర్ణయించుకున్న ఆ రాజు అక్కడే ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు.

కొంత కాలం గడిచింది.

రౌతు పేరమ్మ అనే ధనవంతురాలి ఓడ సముద్రంలో ఉప్పెన వాతన పడగా ఆమె తన ఓడ సురక్షితంగా ఒడ్డు చేరితే వీరేశ్వరస్వామికి మండపం నిర్మిస్తానని మొక్కుకుంది.

ఓడ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మొక్కుబడి ప్రకారం ఆ స్వామికి ఆలయంలో ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు.

తూర్పు గోదావరి జిల్లాలో మురుమళ్ళ గ్రామంలో వుంది భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం. మునులు ఆశ్రమంలో నివసించినందువల్ల ఆ ప్రదేశాన్ని మునిమండలి అని పిలువబడిన ఈ ప్రదేశం కాలక్రమేణా మురమళ్ళగా మారింది.

గోపురద్వారం దాటి ముందుకెళ్తే పెద్ద ప్రాకారం బలిపీఠం, ధ్వజస్తంభం తర్వాత వున్న మండపంలో స్వామివారి ఎదుట రెండు నందులు. ఇందులోని చిన్న నందిని ఉపనంది అంటారు.

గర్భగుడి ఎదుట కుడివైపున వినాయకుడి దర్శనం లభిస్తుంది.

గర్భగుడిలో వీరేశ్వరస్వామి అనబడే వీరభద్రస్వామి లింగరూపం పశ్చిమ దిక్కున చూస్తున్నట్టున్న విగ్రహం చూడ్వచ్చు. గునపం తగలడం వల్ల దెబ్బతిన్నస్వామి వారి లింగాన్ని దర్శించగలం.

ఉగ్రమైన వీరభద్రస్వామికి రోజూ అభిషేకానికి ముందు చందనాలంకారం చేస్తారు. అయినా ఆస్వామికి అర్పించే బిల్వ దళాలు ఒక గంటలో వాడిపోతాయట.

గోదావరి నది నుండి నీటిని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. ఆ తర్వాత స్వామివారికి చేసే అభిషేకం మరుసటిరోజు దాకా ఉంటుంది.

స్వామివారి రౌద్రాన్ని తగ్గించడానికి అమ్మవారు కన్యారూపధారణ అదే పీఠం పై ప్రతి్ష్టిపబడింది.

లింగరూపంలో వీరేశ్వరస్వామి, కన్యారూపంలో భద్రకాళిదేవిని ఒకే పీఠంపై చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

గర్భగుడికి ముందున్న అర్ధమండపంలో వృషభ వాహనం పై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించగలం.

స్వామిని దర్శించిన తర్వాత తూర్పు ద్వారంలో బయటకి వెళ్తే చిత్రగుప్తుని దర్శించగలం.

నిత్య కల్యాణ ఆలయమైనఅందువలన పెరవేసుకున్న నిత్య కల్యాణ ఆలయమైనందువల్ల పెనవేసుకున్న జంట నాగుల శిల్పాలు స్తంభాలపై చెక్కినారు.

ఆలయ ప్రాకారంలో ఒక ప్రత్యేకమైన మందిరంలో క్షేత్రపాలకుడు నరసిణస్వామి లక్ష్మిదేవి సమేతంగా వున్న విగ్రహం కన్నులవిందు చేయగలదు.

ఈ ఆలయంలో వీరభద్రస్వామి వారికి నిత్య కల్యాణం జరుగుతుంది.

పెళ్లికాని కన్యలకు, స్వామితో పెళ్లి జరిపిస్తే అన్ని సమస్యలు పోయి త్వరలో పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో ఇక్కడ ప్రతి రోజు కనీసం 27 వివాహ మహో్త్సవాలు జరుగుతాయి.

ఉప్పెన వచ్చినా, మరే ప్రకృతి బీభత్సం జరిగినా, ఈ పెళ్లి ఉత్సవాలు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రారంభించి రాత్రి 10.30 దాకా జరుగుతాయి.

ఈ ఉత్సవం జరిగేటప్పుడు యక్షగాన కళాకారులు పాటలు పాడుతారు. మేళ తాళాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ఆరోజు స్వామివారికి పంచభక్ష పరమాన్నాలతో 12 కుండలలో అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత రాత్రంతా వివాహ ఉత్సవాలు జరుగుతాయి.

పెళ్లి జరిగిన తర్వాత దంపతీ సమేతంగా ఆలయానికి వచ్చేవారు అక్కడ ఇచ్చే బియ్యం తీసుకెళ్లి వండి తింటే సంతాన భాగ్యం లభిస్తుంది.

సుఖప్రసవం జరగాలని మొక్కుకునే భక్తుల కోసం నంది పక్కనే ఉన్న ఉపనందిని తిప్పి పెడతారట. తప్పక సుఖప్రసవం జరుగుతుందని భక్తుల నమ్మకం.

కల్యాణభాగాన్నిచ్చే వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల వివాహ మహోస్తవం జరిగేటప్పుడు చూసిన భక్తులు జన్మ సార్ధకం అయిపోతుంది. మోక్షమూ లభిస్తుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: