telugudanam.com

      telugudanam.com

   

పాండిచ్చేరి అమ్మ

అమ్మ! ఒక అందమైన అమృతభరితమైన తియ్యటి పలుకు. పుడమి తల్లి, అన్ని నదులు, ప్రపంచంలో ప్రేమను పంచే అమ్మకు నిదర్శనాలు.

ఆనాటినుండి ఈనాటిదాకా ప్రపంచంలో ప్రేమస్వరూపిణీగా, ప్రేమకు మరోరూపంగా అమ్మను చిత్రీకరిస్తున్నారు. ఆ కోవకు చెంది అందరిపై ప్రేమను కురిపిస్తూ, ఆశీర్వదిస్తున్న అమ్మ పేరుతో పిలవబడే మదర్‌, పిలిస్తే పలికే తల్లిగా పేరొందినది.

పారిస్‌ నగరంలో 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 21 వ తేదీన ఈజిప్ట్‌కు చెందిన మాదిల్డాకు, టర్కికి చెందిన మేళరికి రెండవ కుమార్తె జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మిర్రా ఆల్ఫోసా. చిన్నటినుండి చదువుపై శ్రద్ధ చూపే మిర్రా చిత్రలేఖనము, పియానో వాయించడంలో కూడా దిట్ట. మిగిలిన పిల్లల్లా కాక ఆమెలో ఏదో గొప్పతనం కనిపించేది. అతి చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికతపై ఎంతో స్రద్ధ చూపించేది.

ఒకరోజు తన నాలుగవ ఏట కుర్చీలో కూర్చుని అలా ధ్యాననిమగ్నురాలై పోయిందట. ఆధ్యాత్మిక తత్వం ఆమెలో పెల్లుబుకింది. ఏదో మహత్తరమైన కార్యం చేయడానికి తను జన్మించానని తెలుసుకుంది మిర్రా. దుష్టశక్తులను కనిపెట్టగల అతీతమైన శక్తి ఆమెలో వున్నదని తెలిసింది. మిర్రాకు ఏడు సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. ఆమె చదివే పాఠశాలలో ఒక మొరటు బాలకుండేవాడు. 13 సంవత్సరాల ఆ బాలుడు తనతో చదివే అమ్మాయిలను ఎప్పుడూ హింసించేవాడు.

మిర్రా ఆ బాలుడు చేస్తున్న ఆగడాలను సహించలేకపోయింది. ఎప్పుడు వేదించే ఆ బాలుడి వద్దకు వెళ్లింది. ఆవేశంగా వాడిని పైకెత్తి గిరగిర తిప్పి కింద పడేసింది. పన్నేండేళ్ల బాలికగా వున్న మిర్రాకు అప్పుడప్పుడు రాత్రిళ్లు తన ఆత్మ, శరీరం నుండి బయటకు వెళ్లి తిరిగి తనలో ఐక్యం కావడం కూడా తెలుసుకుంది. ఆ క్షణంలో ఆమె ఎందరికో సహాయం చేయడానికి తన అమృతహస్తాన్ని, ఆశీర్వాదాన్ని అందించినట్టు కూడా ప్రతిదినమూ తోచేది.

స్వర్ణ వర్ణ వస్త్రాలను ధరించి వెళ్తున్నప్పుడు, ఆ వస్త్రాలను తాకిన వ్యాధిగ్రస్తులకు పేదవారికీ ఎంతో మంచి జరిగినట్టు ప్రతిదినమూ ధ్యానము నందు అగుపించేది. అల్జీరియాకు వెళ్లి మార్క్స్‌ ద్యాన్‌, ఆయన సతీమణి అల్మా ద్యాన్‌లను కలిసి పరకాయ ప్రవేశం లాంటి ఎన్నో యోగవిద్యలను నేర్చుకుంది. వివేకానందుల వారి రాజయోగం అనే గ్రంధాన్ని చదిన ఆమె ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానాన్ని పొందగలిగింది. ఆమె మనసులో ఒక మహాజ్ఞాని ఎప్పుడూ ఉన్నట్టు భావించేది.

మిర్రాకు 19 ఏళ్ల ప్రాయంలో వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. వివాహం చేసుకోవాలన్న తలపే లేని ఆమెకు చివరకు ఆ వివాహం ఎంతగానో సాయపడింది. వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఆమె భర్త పాల్‌ రిచర్డ్‌ ఈ దేశ గొప్పతనాన్ని అరబిందో మహాత్యాన్ని వివరంగా తెలిపాడు. తన భర్తతో 1914 వ సంవత్సరంలో పాండిచ్చేరికి వచ్చిన ఆమె అరబిందోని కలిసింది. ఇంతదాకా తనకు మార్గదర్శకంగా, కృష్ణునంగా, మహోన్నత శక్తిగా తనకు మార్గదర్శకత్వం చేసింది ఆ మహాత్ము్డేనని తెలుసుకుంది.

మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో మిర్రా తమ స్వదేశానికి తిరుగుముఖం పట్టింది. అక్కడినుండి జపాన్‌ లాంటి ఎన్నో దేశాలకు వెళ్లినా అమెకు భారతదేశంపై ఒక విధమైన అనుబంధం ఏర్పడింది. ఆరు సంవత్సరాల తర్వాత పాండిచ్చేరికి మళ్లీ వచ్చిన ఆ 'అమ్మ' తన ఆఖరి క్షణం దాకా అక్కడే వుండిపఒయింది. 1926 వ సంవత్సరంలో అరవిందాశ్రమం నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఆమె అక్కడ ఎంతో కీలకమైన పాత్ర వహించింది.

ప్రేమ, ఆనందం, ప్రశాంతత లాంటి ఎన్నో ఆధ్యాత్మిక తత్వాలను చాటి చెప్పి బోధించిన ఆ ఆశ్రమం 'అమ్మ' ఆశీస్సులతో ఎంతో ఉన్నతమైన స్ధాయికి చేరుకుంది. 1952 వ సంవత్సరంలో ప్రపంచ విద్యా కేంద్రము మరియు 1964 ఆరోవిల్‌ అనే ప్రపంచ సమైక్యతా నగరం మదర్‌ అనితర కృషి వల్ల నిర్మించబడినది.

సుమారు 50 సంవత్సరాల పాటు మదర్‌ యొక్క ప్రేమ, ఆశీస్సులు భక్తులు పొందగలిగారు. 95 ఏట వరకు మానవ సేవలో నిమగ్నమైన మదర్‌ 1973 వ సంవత్సరం నవంబర్‌ 17 వ తేదీన పరమపదించారు.

మదర్‌ ఆశీస్సులను పొందిన ఎందరో భక్తులు ఆమెను ఒక దైవంగా భావిస్తున్నారు. ఈనాటికీ లక్షల కొలది భక్తులు ఆమె సమాధిని దర్శించి ప్రశాంతతను, ఆనందానుభూతిని పొందుతున్నారు. పుష్పాలతో ఎన్నో దైవీక గుణాలున్నట్టు తెలుసుకున్న మదర్‌ ఆధ్యాత్మిక మార్గంలో వున్న వారు వాటినెలా పెంచాలి? ఎలా కాపాడాలి? లాంటి మెలుకువలనూ నేర్పింది. అందుకే ఈనాటికి ఆమె ఫోటోకు సమాధిపైనా ఎన్నో పుష్పాలను అలంకరిస్తారు. మదర్‌ను జ్ఞానులు, నేత్రాదేవి అని పిలిచేవారు అందుకే ఆమె నేత్రాలున్న చిత్రాన్ని ఇంట్లో ఉంచుకొని భక్తితో పూజిస్తే కళ్లకు సంబంధించిన వ్యాధులు నయమైపోతాయని భక్తుల నమ్మకం.

ఆధ్యాత్మికంగా మదర్‌ను పూజించిన వారికి ఎన్నో అద్భుతాలు ఆమె సజీవంగా ఉన్నప్పుడే కాక సమాధి అయ్యాక కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రండి, భక్తితో మదర్‌ను కొలిచి ఆమె ప్రేమ తత్వంలో మునిగి తరించి పోదాం. ఎనలేని ప్రశానతతను పొందుదాం. ముఖ్యమైన మరో అంశం అరవిందాశ్రమం. మదర్‌ ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి, వాటి ద్వారaాభక్తులు తమ జీవితంలో అహర్నిశలు మహోన్నతమైన ప్రగతిని పొందాలని మార్గదర్శిగా నిలిచి ప్రశాంతమైన జీవితాన్ని వరముగా అందిస్తోంధి.

మదర్‌ ఆశ్రమంలో జీవించే శిష్యులనే తమ బిడ్డలుగా భావించింది. వీరి మధ్యన జాతి మత బేధాలు, స్త్రీ పురుష బేధాలు లేక అందరూ సమానమే అని తెలుసుకున్నవారందరూ కలిసికట్టుగా జీవిస్తున్నారు. ఆశ్రమంలో అన్ని పనులు మదర్‌ అనుచరులుగా పేర్కొనబడిన శిష్యులే చేస్తుంటారు. వీరికి విద్య, సంగీతం, చిత్రలేఖనం కాక మరెన్నో కళలను వైద్య వృత్తికి సంబంధించిన మెళకువలు కూడా నేర్పుతారు.

దేహ ఆరోగ్యానికి యోగాభ్యాసము, మానసిక ఆరొగ్యానికి ఆధ్యాత్మిక తత్వము, ధ్యానము మొదలైన వటికి ఎంతో ప్రముఖ్యత నిస్తారు. ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యము మనిషికి రెండు కళ్లతో సమానముగా పేర్కొంటారు.


అందరూ తెలుసుకోదగ్గ మదర్‌ ప్రవచనాలు :

"నేను భగవంతుడి ముందు పూర్ణశరణాగతి అయినందువల్ల నా మనసు, నా దేహం, నా ప్రగతి ప్రతి ఒక్కటి ఆ భగవంతుడికే సొంతమని భావిస్తున్నాను." "ఉదయం సాయంత్రం ఆశ్రమంలో ధ్యానము జరుగుతున్నప్పుడు మీ ఆత్మ శక్తి ఇంకా పెంచి ఆ భగవత్‌ సాన్నిధ్యం పొందేలా చేస్తాను. మీ ఆత్మకున్న శక్తిని తెలుసుకోగల్గిన తర్వాత ఆ ప్రక్రియను మీరే నిరాటొకంగా కొనసాగిస్తారు."

ప్రతి దినము ఉదయం నా అనుచరులను చూసినప్పుడు వారి అవసరాలను తెలుసుకుని వారి అభీష్టం నెరవేరి సంతోషంగా జీవించడానికి సాయపడ్తాను. మరో విషయం. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లేవారికి ఆహారము, వస్త్రములు ఉండడానికి చోటు - ఈ మూడు అత్యవసరమైనది. వాటికి ఏనాడూ లోటు కలుగకూడదన్నది ఆమెచి రకాల స్వప్నం. 1964 వ సంవత్సరంలో పాండిచ్చేరిలో మదర్‌ నిర్మించిన 'అరోవిల్‌' ఆ స్వప్నానికి పరాకాష్ట.

సుమారు 2000 మంది ఇక్కడ నివసించి ఆధ్యాత్మిక తత్వాన్ని అభ్యసిస్తున్నారు. సమస్త మానవ జాతికి ఈ ఆరోవిల్‌తో సత్సంబంధమున్నాట్టే! అరోవిల్‌ నగరంలో అమ్మ ఆలయం నిర్మించబడింది. ఆలయం లోపలున్న ధ్యాన మండపం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పై కప్పు నుండి వచ్చే సూర్యకిరణాలు ఒక చిన్న రంధ్రం ద్వారా లోపలున్న స్పటికంపై ప్రసరిస్తాయి.

ప్రపంచ దేశాల సమైక్యత, భ్రాతృత్వమునకు ఈ ఆరోవిల్‌ ఒక నిదర్శనంగా పరిగణించబడుతోంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: