telugudanam.com

      telugudanam.com

   

విజయవాడ

సీతానగరం నుండి రోడ్డు మీదకు రాగానే ప్రకాశం బ్యారేజి దక్షిణాగ్ర భాగంతో మొదలయి కృష్ణానది ఈవలి యొడ్డున గల విజయవాడ పట్టణ ప్రవేశం చేయవచ్చును.

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదైతే - ఆంధ్ర రాజకీయాలకు రాజకీయ రాజధానిగా నడి బొడ్డయి విరాజిల్లుతుంది. ఈ నగరందక్షిణాదికి - ఉత్తరాదికి సింహద్వార మనదగిన రైల్వే కూడలి. దినదినమూ విపరీతమైన జనసమ్మర్ధంతో కిటకిటలాడుతూ నగరం రోజంతా సందడిగా ఉంటుంది. ఇక్కడికి అనేక పనుల మీద ప్రతి రోజూ వచ్చేపోయే జనాలే కనీసం లక్షల సంఖ్యలో వుంటారని అంచనా. నగరం నడి బొడ్డులో పాత నగరాన్ని పశ్చిమోత్తర నగరాన్ని కలుపుతూ పెద్ద మెయిన్ రైల్వేస్టేషనున్నది. ఇక్కడనే సర్ అర్దర్ కాటన్ మహాశయుడు 1850 జనవరిలో ప్రారంభించి 1858 అక్టోబరులో ముగించిన కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట కాలానికతీతంగా నిలిచి దర్శనమిస్తుంది.


క్షేత్ర వైభవం

పూర్వం మహా భారత కాలంలో పాండవ మధ్యముడు పాశుపతాస్త్రమును సంపాదించటానికి ఇంద్రకీలాద్రిపై తపమొనరించి నాడట. అందుచేత విజయమును సాధించిన అర్జునిడి నామములలో విజయుని పేరు సార్ధకనామంగా విజయవాడగా రూపొందినదని భావము. అనాది నుండి గొప్ప తీర్థయాత్రా స్థలంగా పేరు గాంచింది. ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగే కృష్ణ పుష్కరోత్సవములను లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తారు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాలయం కొండ మధ్యభాగంలో వున్నది. కొండ క్రిందనే విజయేశ్వరాలయము, ప్రక్కనే శంకరమఠం ముందుగా దుర్గాలయం చేరటానికి మెట్లున్నాయి. ఇప్పుడే నూతనంగా కొండమీదకి సరాసరి రోడ్డుమార్గమును నిర్మించి మినీ బస్సు సౌకర్యంకూడా ఏర్పరిచారు, ఈ మినీ బస్సు నగర ప్రధాన కూడలులను స్పృశిస్తూ సత్యనారాయణ పురం రైల్వే క్వార్టర్సు వరకు వున్నది.

అమ్మవారు మహా తేజోమహిమతో అలరారుతుంది. నిత్యమూ యాత్రికులు సందర్శించటానికి వీలుగా ఉదయం ప్రాతః కాలంలో 5 గం.ల నుండి 12 గం. ల వరకు, మరల సాయంత్రం 2 గం. ల నుండి రాత్రి 9 గం.ల వరకు పూజలు జరుగుతుంటాయి. విద్యుద్దీపాలంకరణ చూడ ముచ్చటగా చేయబడుతుంది. దుర్గమ్మ వారి ఆలయము ఆనుకునే మల్లేశ్వారాలయం కూడా వుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరాలయాల మద్య విద్యుత్ జల ప్రసార వైచిత్రితో రాసలీల, గంగావతరణ దృశ్యాలు కడు రమణీయంగా అమర్చబడినాయి. కొండ మీది అమ్మ వారి దర్శనం చేయగానే సుందరమైన నగరమంతా కృష్ణా నదీ తీర రమ్యతలతో మేళవించి నగర దర్శనం మహాద్భుతమైన అనుభూతి. అలాగే అదే త్రోవనే కొన్ని మెట్లు దిగి మరి కొన్ని మెట్లు ఎక్కిన శ్రీ మల్లేశ్వరాలయం చేరవచ్చును. ఇది కూడా ఒక అనాది దేవాలయము. శ్రీ మల్లేశ్వరుని దర్శించి మెట్లుదిగి కొంత దూరం నడిస్తే క్రొత్తగుళ్ళు అని ప్రసిద్ధి గాంచిన కొన్ని దేవాలయాల సముదాయమును ఒకే చోట కాంచనగును.

ఇక్కడ శ్రీ వెంకటేశ్వర, కోదండరామ, శివాలయములు ఒకే ఆవరణలో వుండటం చూడగా శివకేశవుల అబేధత్వము దర్శనీయ భావన కలుగుతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: