telugudanam.com

      telugudanam.com

   

పురాణాలు

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.

పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ ప్రబంధాలన్నీ పురాణాలలోంచే ముడి సరుకుని తీసుకున్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామక్రుష్ణుడు తన పాండురంగ మహాత్యానికి స్కాంద పురాణమే ఆధారమన్నాడు. రాయల వారు అముక్తమాల్యదలోని కొన్ని కథలను విష్ణు పురాణం నుంచి తీసుకున్నాడు.

మానవ జీవితానికి కావలసిన శాస్త్ర విషయాలను పురాణాలలో మన ఆదిమ ఋషులు చేర్చేవారు. ఋషి ప్రోక్తాలు కాబట్టే పురాణాలను కూడా వేదాలలాగే ప్రమాణద్రుష్టితో చూసేవారు. నిజానికి మనకు వేదకాలంలో కూడా పురాణ సాహిత్యం ఉంది. అధర్వ వేదం పురాణాన్ని పేర్కొంది. ఉపనిషత్తులు కూడా పురాణ ప్రాముఖ్యాన్ని శ్లాఘించాయి. వేద కాలం నాటి పురాణ సమ్హితలో 4 వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి. అవి నేటికి పెరిగీ పెరిగీ కొన్ని లక్షల స్లోకాలుగా పరిణామం చెందాయి. 18 మహా పురాణాలలోని శ్లోకాలు 4,11,000 అని లెక్కతేలుతున్నాయి. ఉప పురాణాల శ్లోక సంఖ్య అంచనా కట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు.

సిద్ధాంతాల ఘాటునుబట్టి పురాణాలను సాత్విక, తామస, రాజస పురాణాలని 3 గుణాలవారీగా వర్గీకరించవచ్చు. పురాణంలోని ప్రతి ఒక్క కథకూ ఫలశ్రుతి చెప్పారు. ఫలానా ఫలం కావాలంటే ఫలానా నోము నోచమన్నారు. ప్రతి పురాణాన్నీ వ్యాసుడు వ్రాస్తే దాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులకు చెప్పాడు. అయితే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో పుడుతుంది. కల్పమంటే బ్రహ్మ దినం. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం అన్నమాట.

విశ్వము యొక్క సృష్టి స్ధితి లయములు, రాజవంశములు మున్నగు వాని చరిత్రములను పురాణములు వివరించును. మరియు భగవంతు డొనర్చు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణములను, మనుజులు పాటింపవలసిన ధర్మములను, ఆధ్యాత్మిక సాధనలను పురాణములు ప్రబోధించుచున్నవి. పవిత్ర క్షేత్రములు, తీర్ధస్ధలములు మున్నగువాని మహత్యములను గూడ పురాణములలో వర్ణింపబడినవి.

శబ్దప్రధానములైన వేదములు ఏ విషయములను ప్రభువువలె శాసించునో ఆ విషయములనే అర్ధ ప్రధానములైన పురాణములు మిత్రుని వలె కథలద్వారా మనకు తెలియపరచును. అందువలన హిందూ సాహిత్యములో పురాణములు మిక్కిలి ప్రధానములై యున్నవి.


అష్టాదశ పురాణాలు

 1. మత్స్య పురాణము
 2. మార్కండేయ పురాణము
 3. భాగవత పురాణము
 4. భవిష్య పురాణము
 5. బ్రహ్మ పురాణము
 6. బ్రహ్మాండ పురాణము
 7. బ్రహ్మ వైవర్త పురాణము
 8. వరాహ పురాణము
 9. వామన పురాణము
 10. వాయు పురాణము
 11. విష్ణు పురాణము
 12. అగ్ని పురాణము
 13. నారద పురాణము
 14. స్కంద పురాణము
 15. లింగ పురాణము
 16. గరుడ పురాణము
 17. కూర్మ పురాణము
 18. పద్మ పురాణము

1.మత్స్య పురాణము

దీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.


2.మార్కండేయ పురాణము

ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.


3.భాగవత పురాణము

దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.


4.భవిష్య పురాణము

దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.


5.బ్రహ్మపురాణము

దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గూర్చి వివరించబడినవి.


6.బ్రహ్మండ పురాణము

దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.


7.బ్రహ్మ వైవర్త పురాణము

దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడింది.


8.వరాహ పురాణము

దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.


9.వామన పురాణము

దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము - ఋతు వర్ణనలు వివరించబడినవి.


10. వాయు పురాణము

దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.


11. విష్ణు పురాణము

ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.


12. అగ్ని పురాణము

దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.


13. నారద పురాణము

ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.


14.స్కంద పురాణము

దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహ్మొత్తర ఖండము (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహకాల మహత్మ్యము) మొదలగునవి కలవు.


15.లింగ పురాణము

ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.


16.గరుడ పురాణము

ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ - నరక ప్రయాణములు తెలుపబడినది.


17.కూర్మ పురాణము

ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.


18.పద్మపురాణము

ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం - పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: