telugudanam.com

      telugudanam.com

   

శ్రావణ మంగళవారపు వ్రతము

[ వెనుకకు ]


ఒక బ్రాహ్మణుడు సంతానము లేక పోవుటచే మిగుల పరితపించి సంతానము బడయుటకుగాను పరమేశ్వరుని గూర్చి ఘో(గో)రతపము చేసెను. అంతట కొంత కాలమునకు పార్వతీపరమేశ్వరులతనికి ప్రత్యక్షమై కోరికను తెలుపవలసినదనిరి. అతడు సంతానవరము నొసగవలెనని ప్రార్ధించెను. వారు నీకాయువు లేని కొడుకు కావలయునా? లేక అయిదవతనములేని కుమార్తెకావలెనా? అని ప్రశ్నించిరి. అందుకతడు బదులు చెప్పలేక ఆవిషయమును భార్యనడిగి తెలుసుకొనెదనని చెప్పి వారి ఆజ్ఞ నొంది, ఇంటికివచ్చి భార్యనుజూచి - "మనకు ఆయువు లేని అబ్బాయి కావలెనా? లేక అయిదవతనముచాలని అమ్మాయి కావలెనా?" అని ప్రశ్నించెను. ఆమె "పుట్టిచచ్చినను పుత్రుడే కావలయును. ఆడుబిడ్డతో ఆపదలుపడలేమని" చెప్పెను. వెంటనే అతడామాటలను పార్వతీపరమేశ్వరులకు విన్నవించుకొనెను. అది విని వారతనితో "ఊరివెలుపల నున్నమామిడిచెట్టు పండునొక దానిని తీసుకొని నీభార్య కొసగుము. అది తినినపిమ్మట నామెగర్భవతియగును" అని తెలిపి అదృశ్యులైరి. అంతట నాబ్రాహ్మణుడా మామిడి చెట్టు దగ్గరకుపోయి ఆశకొలది చాల పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళి చూచెను. కాని అతని ఒడిలో ఒకపండు మాత్రమేవుండెను. పరమేశ్వరుని నియోగమున కెదురు డదనుకొని అతడా పండును భుజింపమని భార్యకిచ్చెను. ఆమెదానిని భుజించి నంతనే గర్భిణి అయ్యెను. పిమ్మట నవమాసములు నిండిన తరువాత నొక పుత్రుని కనెను. ఆబాలుడు పుట్టినదే తడవుగ, యమ భటులువచ్చి ఆశిశువును తీసుకొని పోవనెంచిరి. అదిచూచి తల్లి "నాయనలారా! బిడ్డపుట్టెను; కాని పురిటిముచ్చటతీరలేదు. పురుషుడైన తర్వాత వీనిని మీరుతీసుకుపొండు" అని వారిని బ్రతిమలాడగా వారు వెడలిపోయిరి. పురుడయిపోయెను; యమభటులువచ్చిరి. మరల నామె "నాయనలారా! బిడ్డనడుగుచూచి మేము ఆనందించిన తర్వాత తీసుకొనిపోవచ్చును; నామనవి ఆలకింపు"డని కోరెను. వారు మరల వెళ్ళిపోయిరి. ఆ బాలుడుదినదిన ప్రవర్ధమానుడగుచుండెను. బారసాల పూర్తయ్యెను. ఒకనాడామె తనపుత్రునకు అభ్యంగస్నానము జేయించుచు యమభటులు వచ్చెదరను భయముతో దుఃఖించుచుండ రెండు వెచ్చటికన్నీటి చుక్కలా బాలునిపై బడెను. అదిచూచి అతడా దుఃఖమునకు కారణమును తెలుపవలసినదని తల్లినికోరెను. ఆమె పొంగి పొర్లుకొని వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనలేక బావురుమని యేడ్చుచు నంతవరకు యమభటులకు తనకు జరిగిన సంధిని, యిక ముందాతనిని యెట్లు కాపాడుకొనుటో తెలియక బాధపడుచుండెను. అదిచూచి యాబాలుడు తల్లికి ధైర్యమును జెప్పి "అమ్మా! నాకు మామయ్యను తోడొసగుము నేను మామతో కలసి కాశీకి వెళ్ళి వచ్చెదను" అని చెప్పెను. అందుకామెయంగీకరించి తన అన్నను కొడుకునకుతోడిచ్చి కాశీకిపంపుచు పుత్ర ప్రేమను నాపుకొనలేక యేడ్చుచుండెను. అప్పుడా బాలడొక తులసిమొక్కనుపాతి, తల్లికి దానిని చూపించి దాని బాగుయోగులను బట్టి తన యోగక్షేమమునామె గ్రహింపవలసినదని చెప్పి మేనమామతో కాశీకిపయనమై పోవుచుండెను. వారట్లు వెడలుచుండగా మార్గమధ్యమున నొక చక్కనిపూలతోట కనిపించ నందు బసచేసిరి. ఆ తోటలోని పూవులను కోసుకొనుటకు ఆ ఊరి రాజు కూతురు, పురోహితుని కూతురు, పెద్దకాపు కూతురు, శెట్టికూతురు వెళ్లి కావలసినన్ని పూవులను కొసుకొనిరి. తిరిగియింటికి వెళ్లిపోవుసమయమందు వారిలో వారికి జగడమువచ్చెను. అందులో వారు ఒకరినొకరు 'ముండ' అని తిట్టుకొనిరి. అప్పుడు రాజు కూతురునకు కోపమువచ్చి ఆమె "నాకీనాటి రాత్రికి పెళ్లి కానున్నది. మాయమ్మ శ్రావణమంగళ వారపునోమునోచుకొని నాకు వాయనమిచ్చును. నన్ను "ముండాయని అనవద్దు" అని తనచేతనున్న పువ్వులను నేలమీదపడవేసెను. అవన్నీ యెగిరిపోయి కొమ్మలకు అంటుకుని ఎప్పటియటేయుండెను. ఆ ఆశ్చర్యకరమైన దృశ్యమునుచూచి ఆ తోటయందేయున్న బ్రాహ్మణ బాలుడామె మహత్మ్యమును పొగడి ఆమెతనకు భార్యయైనచో ఎంత బాగుగానుండెడిదో కదా యని లోలోన అనుకొనెను. ఆ ప్రక్కనేయున్న అతని మేనమామ ఆ విషయమును గ్రహించి, కాశీకి ప్రయాణము చేయు వారికి కాంతా కాంక్ష తగదని మందలించెను. అంతలో నా బాలికలి తోటవిడిచి తమ తమ గృహములకు వెడలిపోయినారు. రాజుగారు తన కుమార్తెను పెండ్లికుమార్తెనుజేసి, మగపెండ్లి వారికొరకు ఎదురుచూచుచుండెను వారెంతకును రాకుండిరి. ముహూర్తము సమీపించుచుండెను. అంతలో వారిదగ్గరనుండి ఒక వార్తాహరుండొక జాబును దెచ్చి రాజుగారికిచ్చెను. రాజాఉత్తరమును చదువుకొని పెండ్లికుమారునకు జబ్బుచేయుటచే మగ పెండ్లివారు రాకున్నారని అక్కడున్న వారికి తెలిపెను. తాను నిశ్చయించుకొన్న సమయమున పెండ్లి చేయకుండుట పరువుతక్కువ యనుకొని యెరువు పెండ్లికొడుకుతో పెండ్లి చేయనిశ్చయించెను. అందుచే నాతడెరువు పెండ్లికొడుకు కొఱుకు గ్రామమంతటనుతిరిగెను. కాని ఎవ్వరును ఎరువు పెండ్లికొడుకుగా నుండుటకు అంగీకరింపరైరి. అంతటనాతడు పూలతోటలోనున్న భ్రాహ్మణబాలుని చూచి అతని మేనమామను బలవంతముమీద వొప్పించి వానికి తనకూతురునిచ్చి వివాహకార్యము నిర్వర్తించెను. పిమ్మట నా బ్రాహ్మణ బాలునికొక బంగారుగిన్నెయందుఫలహారములుంచి యతని కొసగెను. వాటినాతడు భుజించుచుండగా, అతని వేలి యుంగరము ఆ గిన్నెలో పడె. దాని నారాజకుమార్తెచూచి తీసుకుని, తన వ్రేలికి పెట్టుకొనినిద్రించె. ఆనిద్రలో నామెకు పార్వతీదేవి కనుపించి, ఆమెభర్తకు సర్పగండమున్నదని తెలిపి, జాగ్రత్తపడవలసినదని హెచ్చరించి, ఆపామును ఆమెతల్లి శ్రావణ మంగళవారపు నోమునోచుకొనిన కుండయందు పట్టవలెనిని యాజ్ఞాపించెను. అది విని ఆమె వులికిపడిలేచి, చూచుసరికి ఒక పెద్దపాము బుసలకొట్టుచు, నిద్ర పోవుచున్న పెండ్లికొడుకు దగ్గరకువచ్చుచుండెను. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకపైనున్న నోముకుండకొఱకు చేయిసాచెను. కాని అది అందలేదు. పాము మిగుల సమీపమునకు వచ్చుచుండెను. అందుచే నామె సాహసించి అతని తొడపై నిలచి కుండనుదింపి పామునందు పట్టి ఒక రవికెలగుడ్డతో దానిమీదవాసినకట్టెను సంధ్యారాగపువేళ నాబాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి తీసుకొనిపోయెను.

తరువాత కొన్ని దినములకు పూర్వపు మగపెండ్లివారు పెళ్ళి సన్నాహముతో నా గ్రామమునకు వచ్చిరి. అంతట నారాజకుమారి తండ్రికూడ పెండ్లి ప్రయత్నాలుచేసి, ఆమెకు పెండ్లి చేయబోయెను. కాని ఆమె యందు కంగీకరింపలేదు. మొదటి ముహూర్తమునందు తనను పెండ్లాడి కాశీకేగినవాడే తన భర్తయని చెప్పెను. ఆమె తండ్రి అతడు యెరువు పెండ్లికొడుకని వివరించెను. అందుకామె అంగీకరింపలేదు. అప్పుడా రాజామెను కాశీకి పోయినవాడే నీభర్తయనుటకు నిదర్శనమును చూపుమని కోరెను అందుకా చిన్నది "తండ్రి! నీవొక సంవత్సరమన్న దానము చేయుము నేనాసంవత్సరము తాంబూలదానమును చేసెదను.. పిమ్మట నీకు నిదర్శనము జూపెద"ననెను, అందుల కాతడొప్పుకొనెను. ఒక యేడాదిపాటు వారిరువురు నట్లు దానములు చేయుచుండిరి. సంవత్సరము పూర్తికాగానే కాశీనుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామతో వచ్చి పూర్వపు పూలతోటయందేబసచేసిరి. ఆ తోటలోనివారు రాకుమార్తె చేయుచున్న దానములనుగూర్చి అతనికి తెలుపగా నతడు తన మేనమామతో నక్కడకు వెళ్ళి భోజనమును జేసినపిమ్మట రాకుమారినుండి తాంబూల దానమును గ్రహించుటకు వెళ్ళెను. వెంటనే ఆ రాకుమారి వానికి తాంబూలములనిచ్చి అతనిని పట్టుకొని "ఇతడే నాభర్త" అని యెలుగెత్తి పలికెను, అప్పుడు పెద్దలు వచ్చి "ఇతడు నీనాధుడనుటకు నిదర్శనము లేవి? యని యడిగిరి. రాజకుమార్తె తన వ్రేలియుంగరముదీసి "పెండ్లినాడీయన బంగారుగిన్నె యందు ఫలహారము చేయుచుండగా ఈవుంగరముజారి దానియందు పడెను దీనినప్పటినుండి శుభ్రపరచి యుంచితిని" అని చెప్పి దానినతని వ్రేలికి తొడిగెను; అది అతనికి చక్కాగా పట్టెను. పిమ్మటనామె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పినమాటలను, వాటికనుగుణముగ తానొనర్చిన పనులను దెల్పి కుండనందుకొనుచు తానాతనితొడపై నిలచిన దానికి నిదర్శనముగ అతనితొడపైన నాటికిని నారాణికాళ్ళు పసుపు జాడలతో నిలిచియుండుట చూపించెను. తరువాత నామె యొకకుండను దెచ్చి తానందుపామును గట్టిన సంగతిదెలిపి పైనున్న వాసినవిప్పెను. అందులో పడినపాము బంగారుపాముగా మారెను. అన్ని నిదర్శనములను కండ్లారగాంచినపిమ్మట పెద్దలందరూ నామెమాటల కామోదించిరి. పిమ్మట నారాజువారిరువురకు నిజముగా పునర్వివాహము చేయించి నా బ్రాహ్మణ బాలునితో కూతురును కాపురమునకు పంపెను. ఆచిన్నది వెళ్ళునపుడు శ్రావణ మంగళవారపునోమును నోచుకుని ఆ కాటుక పట్టుకుని అత్తవారింటికి వెళ్ళెను. అక్కడున్న నా బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులాతని వియోగమునకు మంటికి మింటికి నేకధారగా నేడ్చుటచే గ్రుడ్డివారయి యుండిరి. గ్రామస్తులందరు నా బాలుడు పెండ్లిదుస్తులతో పెండ్లాముతో పెండ్లి ఊరేగింపుతో వచ్చుచుండగా చూచి, ఆవిషయమును గ్రుడ్డివారయియున్న అతని తలిదండ్రులకు దెలిపిరి. కాని నిరాశాపూరితులై యున్న వారావిషయమును నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అంధులుగ నుండుటగ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారికండ్లకు పెట్టెను. వెంటనే వారికి వెనుకటి చూపువచ్చెను. అదిచూచి అందరు ఆశ్చర్యపడి యేమినోము నోచితివని యడుగగా నామె తాను శ్రావణమంగళవారపు నోమును నోచినట్లు తెలిపెను. అప్పటినుండి మిగిలిన వారుకూడ నానోమును నోచుచుండిరి.


దీనికి వుద్యాపనము

ఈనోము ఐదుసంవత్సరములు నోచిన తర్వాత వుద్యాపన జేయవలయును. మొదట అయిదుగురు రెండవ యేట పదిమంది, మూడవయేట పదిహేనుమంది, నాల్గవయేట యిరువదిమంది, ఐదవయేట యిరవైఐదుమంది ముత్తైదులను పిలచి వాయనములీయవలెను. అట్లు ఐదుసంవత్సరములు చేసిన తరువాత పెండ్లి దినమున పెండ్లికుమార్తెను ఒక క్రొత్తకుండలో ముప్పది మూడు జోడుల అరిసె పెట్టి క్రొత్తరవికెగుడ్డతో దానికి వాసన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలెను. పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపమురాదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: