telugudanam.com

      telugudanam.com

   

సంపద శుక్రవారపు వ్రతము

[ వెనుకకు ]


సంపద శుక్రవారపు వ్రతము

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు గలరు. వారందరకు వివాహములయి భార్యలు కాపురమునకు వచ్చుటచే, వేరింట కాపురములు చేయుచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారము మహాలక్ష్మీ సంచారముచేయుచు ఆ బ్రాహ్మణుని కోడండ్ర యిళ్ళకు వెళ్లెను. ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనముపెట్టి తానుగూడ తినుచుండెను.ఇంకొక ఆమె పాచి వాకిలో పేడవేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. ఇంకనొక్కకోడలు కటికచీకటియందే తలదువ్వుకొనుచుండెను. వేరొక్కకోడలు పాచి వాకిలి యందే పిల్లలకు తలంటి తాను కూడ తలంటుకొనెను. ఇట్లు ఆరుగురు చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మీ వారి యిండ్లను వెళ్ళక పెద్ద కోడలి యింటికి వచ్చెను. ఆమె యిల్లు అల్లుకొని, వాకిట కళ్లాపునుజల్లి, స్నానము చేసి, పసుపురాసుకొని బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మీ ఆరుగురుమీద కూర్చుని అమ్మాయి! బయట కొకసారి రమ్మ"నెను. లోపలినుండి పెద్దకోడలు నేను వచ్చుటకు వీలులేదు. మేముచాలా బీదవాళ్ళము అదినాకొకటే బట్ట యండుటచే దానిని నాభర్తకిచ్చి ఆయన నాయవారమునకు పంపి నేను తలుపు చాటుననుంటిని" అని తెలియజేసెను. అప్పుడు 'శుక్రవారము' మహాలక్ష్మీ తన బట్టలో సగమామెకు కట్టబెట్టి తనకొకసోలెడు బియ్యము వార్చి పెట్టమనికోరెను. అందుకాయిల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చువరకు నింటబియ్యముండవని చెప్పెను. అప్పుడామె "శుక్రవారపు మహాలక్ష్మీ మాయింటికి వచ్చినది ఆమెకు యివికావలె" నని వర్తకులతో ఆమె కోమటియింటికివెళ్ళి తనయింటికి శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినదని తెలిపి, పప్పుబియ్యము మున్నగు వంటకువలయు పదార్ధముల నిమ్మనికోరగా, నాతడు వాటినన్నిటిని యిచ్చెను. తరువాత నామె యట్లే చెప్పి తెలుకల వాని యింటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి యింటిదగ్గరి పాత్రసామగ్రిని, సాలెవాని యింటిదగ్గర బట్టలను తీసుకుని యింటికివెళ్ళి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మీకి వడ్డించెను. అంతలో నామె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషముగా నింటికివచ్చెను. ఆదినమున నతనికి సంతృప్తికరముగ నాయవారముదొరకెను. అతనికామె భోజనము వడ్డించగా దానిని భుజించి యతడివి యెట్లు వచ్చినవని తెలిపెను. అంతలో శుక్రవారపుమహాలక్ష్మీ తానింక వెళ్ళెదనని చెప్పగా నామె నారాత్రి భోజనముచేసి వెళ్ళవలసినదని కోరెను. అందులకామె యంగీకరించి రాత్రిభోజనమైన తర్వాత వెళ్ళెదననెను అప్పుడా బ్రాహ్మణి "అమ్మా! ఇంత చీకటిలో నెట్లు వెళ్ళగలవు? రేపటిదినమున వెళ్ళవచ్చు" ననెను. అందు కామె సమ్మతించి, నిదురపోయి కొంతరాత్రికి లేచి, తనకు కడుపు నొప్పిగా నున్నదని తెలిపి వెలుపలికి వెళ్ళివచ్చెదనని చెప్పెను. అందుకా బ్రాహ్మణి 'చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆమూలకూర్చొను' మనెను. మహాలక్ష్మీ అట్లే నాలుగు మూలలందును కూర్చొని, తెల్లవారువేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని, యిల్లు బాగు చేయుటకు చీపురును, చేటను బట్టి గది మూలలను చూచెను. నాలుగుమూలలందు నాలుగు బంగారు కుప్పలుండుటను చూచి, ఆమె మహదానందము నొంది, భర్త కావిషయమును దెలిపెను. అతడు లక్ష్మీకి తనపై నున్న దయనుదలచి, భార్యతో సంపద శుక్రవారము నోమును నోపించి, భాగ్యముల బడసి భక్తి విడువక సంతోషముగ నుండెను.


దీనికి వుద్యాపనము

ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మీనికొలిచి, ఒంటిపూట భోజనము చేయవలెను. అట్లు అయిదేండ్లయిన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తలంటినీళ్ళుపోసి భోజనము పెట్టి ఐదు రవికెగుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలెను. పద్ధతితప్పినను ఫలముతప్పదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: