telugudanam.com

      telugudanam.com

   

శ్రీ సత్యనారాయనస్వామి వ్రతము

[ వెనుకకు ]


శ్రీ సత్యనారాయనస్వామి వ్రతము చేయుటకు కావలసిన పూజా సామాగ్రి

ఈ వ్రతము చేయుట వలన సకల శుభాలు చేకూరి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలతో వర్థిల్లగలరు. ఈ వ్రతమును దేవాలయములయందు, నదీ, సముద్ర తీరములందును, పుణ్యక్షేత్రములయందును లేదా తమ స్వగృహమున కూడా చేసుకొనవచ్చును.

వ్రతము చేయుటకు కావలసిన వస్తువులు అన్నియు సమకూర్చుకొనవలయును. అవి ఏవనగా.. శ్రీ స్వామివారి చిత్రపటము, పసుపు, కుంకుమ, బియ్యప్పిండి, వివిధ రకములైన ఫలములు అంటే ద్రాక్ష, ఖర్జూర, కిస్‌మిస్ మున్నగునవి. పాలు, పెరుగు, తేనె, నేయి, పంచదారలు, పటిక బెల్లము, సాంబ్రాణి, హారతి, కర్పూరము, కొబ్బరికాయలు, తమలపాకులు, ఏలకులు, సుగంధ ద్రవ్యములు, కదళీఫలములు, గోధుమ, నూక పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ఇంకను స్వామివారి మంటపారాధనకు కొత్త వస్త్రములు, మంచి గంధము, సువాసన ద్రవ్యములు వీటన్నింటిని శుచిగా సేకరించుకుని పవిత్రమైన, శుభ్రమైన స్థలమునందు భద్రపరచుకొనవలయును.

ఇక ఈ పూజను చేయడానికి వైశాఖమాసము, కార్తీకమాసము, మాఘమాసము వీటిలో ఏ దినమున యందు కాని లేదా ప్రతి ఏకాదశి, పౌర్ణిమ రోజున, సంక్రమణమున గాని జరుపుకొనవచ్చును. ఈ వ్రతమును చేయువారు ఏ విధమైన కష్టములు పడుతున్ననూ వెంటనే వాటి నివారణ తథ్యము. బహు దరిద్రమును అనుభవించుతున్నవారు ఈ వ్రతమును నిర్వర్తించిన అనంతరం ఇక వారిని జ్యేష్ఠాదేవి దరి చేరదు. దీనిని ఎవరైనా చేసుకోవచ్చును. భక్తిశ్రద్ధలు ఉంటే చాలు.


శ్రీ సత్యనారాయనస్వామి

వ్రతమును ఆచరించుటకు ముందుగా చేయు కొన్ని కార్యములు

వ్రతమును ఉదయముగాని, సాయంత్రము కాని చేసుకొనవచ్చును. దీనికి ముందుగా శుచియై శరీరమును శుభ్రపరచుకొనవలెను. సంధ్యావందనాది కార్యక్రమములను పూర్తి చేసుకొనవయును. తదనంతరం శుభకరమయిన మగళవాయిద్యములు, స్వామి వారికి ప్రీతి కలిగించు భజనల నడుము పూజా స్థానమునకు చేరుకొనవలెను.


ఇక పూజాస్థానమునందు చేయవలసిన కార్యములు:

పూజా స్థానమును తూర్పుదిక్కున ఉంచవలెను. తదనంతరం ఆ ప్రదేశమును శుభ్రప్రచి పవిత్ర గోమయముచే అలికి, దానిమీద బియ్యపుపిండి, పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి అరటి ఆకులు, మామిడి ఆకులతో సర్వాంగసుందరముగా, కళకళలాడుతూ ఉండువిధముగా మండపము నేర్పరచవలయును. దానియందు కొత్త వస్త్రమును పరచి పూజా ద్రవ్యములను ఉంచవలయును. అనగా బియ్యముపైన కలశమును ఉంచవలయును. ఆ కలశము నందు కొబ్బరికాయను ఉంచి అప్పుడు శ్రీ సత్యనారాయణస్వామివారి పటమును మంటపము నందు ప్రతిష్ఠించవలెను.


పూజా సమయమునందు గుర్తుంచుకొనవలసిన కొన్ని విషయములు:

నూతన వస్త్రమును పరచినపుడు దానియందు కలశమును పెట్టి దాని చుట్టూ నవగ్రహాలను, అష్టదిక్పాలకులను అవాహన చేసి మిగిలిన అందరి దేవతలను స్మరించుకుని వారి ఆవాహనకొరకు రెండు పోకలు, తమలపాకులు ఉంచవలెను. తరువాత రెండు తమలపాకులపైన రెండు కొబ్బరి కుడుకలను ఉంచి పసుపుతో చేసిన గౌరీదేవిని అందు నిలవవలయును. తదనంతరం సంకల్పము చేసి, మొదట సర్వవిఘ్నములను హరించు గణపతిని ద్యానించాలి, ఆ తరువాత పూజించి తరువాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి వస్త్రధారణ చేసి అష్టోత్తరములు చెప్పుచూ పుష్పములతో పూజించాలి. తరువాత కథలు విని శుభకరమగు హారతిని ఇచ్చి శక్తి కొలది ప్రసాదమునుసిద్దము చేసుకొని స్వామివారికి సమర్పించి తదుపరి తీసుకుని అనంతరం ఆహుతులకు ప్రసాదములను అందించవలయును.


ఫలము:

సకల దారిద్రములను రూపుమాపును. జన్మ జన్మల యందు ఎటువంటి పాపములు చేసిననూ పరిహారమగును. ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. సజ్జనులై ఎల్లరిచే కీర్తింపబడుదురు. వారి సకల అభీష్టములు నెరవేరును. కుటుంబము నందు సుఖసంతోషములు, ఆయురారోగ్యములు, కార్యానుకూలతలు కలిగి సత్యనారాయణ స్వామివారి కృప ఆ కుటుంబమునందు మరియు దీనిని చూచిన, వినిన వారి గృహములందు ప్రసరించును.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: